
ఆయకట్టు అగమ్యగోచరం!
వట్టివాగు ప్రాజెక్టు ప్రధాన కుడికాల్వకు గండి 200 ఎకరాల్లో నీటమునిగిన పంటలు మరమ్మతులు ఆలస్యమయ్యే అవకాశం.. ఆందోళనలో రైతులు
మరమ్మతు చేపట్టాలి
భారీ వర్షంతో గండి పడిన వట్టివాగు కాల్వకు వెంటనే మరమ్మతులు చేపట్టాలి. ప్రాజెక్టు అధికారులకు సరై న అవగాహన లేకపోవడంతో అవసరమైన ఆయకట్టుకు నీరివ్వడం లేదు. సా గు లేని ఆయకట్టుకు నీటిని విడుదల చేస్తున్నారు.
– మెకర్తి గోపాల్, బూర్గుడ, మం.ఆసిఫాబాద్
ప్రతిపాదనలు పంపించాం
భారీ వర్షంతో ప్రాజెక్టు కుడి కాల్వకు గండి పడింది. రూ.14 లక్షలతో మరమ్మతులు చేపట్టేందుకు ప్రతిపాదనలు పంపాం. నిధులు విడుదలైతే రెండు నెలల్లో పనులు పూర్తిచేస్తాం.
– అన్నాజీరావు, డీఈఈ
ఆసిఫాబాద్: భారీ వర్షానికి ఆసిఫాబాద్ మండలంలోని వట్టివాగు ప్రాజెక్టు ప్రధాన కుడి కాల్వకు గండి పడటంతో ఆయకట్టు సాగు అగమ్యగోచరంగా మారింది. ఓ వైపు సాగు పనులు ముమ్మరంగా సాగుతుండగా, అధికారులు నీటి విడుదలను నిలిపివేశారు. మరమ్మతులకు కనీసం రెండు నెలల సమయం పట్టే అవకాశం ఉండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో రెండు రోజులపాటు కురిసిన వర్షాలకు వాగులు, ఒర్రెలు ఉప్పొంగి ప్రవహించాయి. ఎగువ ప్రాంతాల నుంచి భారీ వరద రావడంతో వట్టివాగు కాల్వల్లోకి భారీగా వరద చేరింది. దీంతో కొమ్ముగూడ సమీపంలోని వట్టివాగు ప్రాజెక్టు ప్రధాన కాల్వ 8 కిలోమీటర్ల వద్ద గండి పడింది. బూర్గుడ సమీపంలోని ఎల్– 2 వద్ద సుమారు 200 ఎకరాల్లో పంట పొలాలు వరదనీటిలో మునిగాయి. పంట పొలాలు నీటితో చెరువుల ను తలపించాయి. సాగునీరంతా వృథాగా పోయింది. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ప్రాజెక్టు అధి కారులు కాల్వకు నీటి విడుదలను నిలిపివేశారు. ప్రస్తుతం వరినాట్లు వేస్తున్న తరుణంలో కాల్వకు గండి పడడంతో సాగు పనులకు అంతరాయం ఏర్పడే అవకాశం ఉంది.
లక్ష్యం చేరని ప్రాజెక్టు
ఆసిఫాబాద్ మండలం పహడిబండ వద్ద రూ.120 కోట్లతో వట్టివాగు ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారు. 1998లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రాజెక్టును ప్రారంభించారు. ఆయకట్టుకు సాగునీటిని అందించాలన్న ఉద్దేశంతో నిర్మించిన వట్టివాగు ప్రాజెక్టు లక్ష్యం నెరవేరలేదు. ప్రాజె క్టు కింద 24,500 ఎకరాలకు సాగు నీరందించాల్సి ఉంది. కుడికాలువ ద్వారా 21,800 ఎకరాలు, ఎడ మ కాలువ ద్వారా 2,700 ఎకరాలకు సాగు నీరు అందాలని లక్ష్యంగా నిర్దేశించారు. ఈ ప్రాజెక్టు ద్వారా ప్రస్తుతం 16 వేల ఎకరాలకు సాగు నీరంది స్తున్నట్లు ప్రాజెక్టు అధికారులు పేర్కొంటున్నా వాస్తవంగా మూడు వేల ఎకరాలకు కూడా మించడం లేదని రైతులు వాపోతున్నారు. ప్రాజెక్టు కాల్వలు మొత్తం దెబ్బతిన్నాయి. ఆది నుంచి ఆధునికీకరణ కు నోచుకోకపోవడంతో లైనింగ్ కోల్పోయి పిచ్చి మొక్కలు ఏపుగా పెరిగాయి. చాలాచోట్ల నామరూపాలు లేకుండా పోయాయి. ఆసిఫాబాద్, రెబ్బెన మండలాల పరిధిలోని పూర్తిస్థాయి ఆయకట్టు రైతులకు సాగునీరందించే పరిస్థితి లేదు. రెండు, మూడేళ్లు నిరీక్షించిన చాలామంది రైతులు పంట పొలాలకు సాగునీరందక.. కట్టలు తెంచేసి ఆరుతడి పంటలే సాగు చేసుకుంటున్నారు.
నీరున్నా నిష్ఫలం
వట్టివాగు ప్రాజెక్టులో సమృద్ధిగా నీరున్నప్పటికీ ఆయకట్టుకు సాగునీరందని పరిస్థితి నెలకొంది. ప్రాజెక్టులో వరద నీరు పెరగడంతో ప్రాజెక్టు అధికా రులు రెండు గేట్లు ఎత్తివేశారు. గరిష్ట నీటిమట్టం 239.5 మీట ర్లు కాగా, ప్రస్తుతం 238.30 మీటర్లకు చేరింది. ఇన్‌ఫ్లో 2700 క్యూసెక్కులు, ఔట్‌ఫ్లో 1000 క్యూసెక్కులు ఉంది. భారీ వర్షాలకు ప్రాజెక్టు కాల్వ కు గండి పడటంతో రూ.14 లక్షలతో మరమ్మతుల కు ప్రతిపాదనలు పంపించారు. అధికారులు చొరవ తీసుకుని మరమ్మతులు వేగంగా పూర్తిచేయాలని ఆయకట్టు రైతులు కోరుతున్నారు.

ఆయకట్టు అగమ్యగోచరం!