
ఆయిల్‌పామ్‌కు పందుల బెడద
ఈచిత్రంలో కనిపిస్తున్న పెంచికల్‌పేట్ గ్రామానికి చెందిన రైతు పేరు శ్రీనివాస్‌రెడ్డి. గన్నారం శివారులో సుమారు 13 ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు చేశాడు. ప్రస్తుతం పంట కాత దశలో ఉంది. నెల రోజుల క్రితం పెద్దఎత్తున అడవి పందుల గుంపు తోటలో ప్రవేశించి ఆయిల్‌పామ్ గెలలను నాశనం చేశాయి. పంట రక్షణ కోసం సుమారు రూ.3లక్షలతో తోట చుట్టూ మెష్ ఫెన్సింగ్ వేశాడు. ఆయినా అడవి పందులు తోటలోకి చొరబడుతున్నాయని వాపోతున్నాడు.
పెంచికల్‌పేట్: ప్రభుత్వం సబ్సిడీ, ప్రోత్సాహకాలు అందించడంతో జిల్లాలో అన్నదాతలు అధికారుల సూచనలతో పెద్దఎత్తున ఆయిల్‌పామ్ పంట సాగుచేశారు. నాలుగేళ్ల క్రితం నాటిన మొక్కలు ప్రస్తుతం కాపుకు వచ్చాయి. అటవీ ప్రాంతాలకు సమీపంలో ఉన్న ఆయిల్‌పామ్ గెలలను అడవి పందులు ధ్వంసం చేస్తుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
పందులతో పరేషాన్..
జిల్లాలో ఆయిల్‌పామ్ సాగు చేయాలని ఉద్యానవన శాఖ అధికారులు పెద్దఎత్తున అవగాహన సదస్సులు నిర్వహించారు. ప్రభుత్వం ఎకరానికి 90శాతం సబ్సిడీ, ఉచితంగా డ్రిప్, అంతర పంటల సాగుకు సైతం ప్రోత్సాహకం అందజేసింది. దీంతో పెంచికల్‌పేట్, దహెగాం, కాగజ్‌నగర్ మండలాల్లోని రైతులు పెద్ద ఎత్తున ఆయిల్ పామ్ సాగు చేశారు. కాగా ప్రస్తుతం మొక్కలు తక్కువ ఎత్తులో ఉండటంతో అడవి పందుల గుంపులు తోటలను ధ్వంసం చేస్తున్నాయి. పగలు, రాత్రి తేడా లేకుండా తోటల్లో సంచరిస్తున్నాయి. ఆయిల్‌పామ్ గెలలను నాశనం చేస్తున్నాయి. పంటల రక్షణకు తోటల చుట్టూ కంచె వేసినా అడవి పందుల బెడద తప్పడం లేదని రైతులు వాపోతున్నారు. గెలలను రక్షించుకోవడానికి పగలు, రాత్రి తేడా లేకుండా తోటల్లో కాపలా కాస్తున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పందుల దాడులతో నష్టపోయిన పంటలకు సంబంధిత శాఖ అధికారులు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు.
పంటల రక్షణకు సూచనలు
ఆయిల్‌పామ్ సాగు చేసిన రైతుల తోటలను సందర్శించి పంటల రక్షణకు సూచనలు చేస్తున్నాం. ప్రస్తుతం తక్కువ ఎత్తులో ఉన్న చెట్లకు కాత రావడంతో అడవి పందులు పంటలను ధ్వంసం చేస్తున్నాయి. పంటల రక్షణకు ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో రైతులకు సలహాలు అందజేస్తున్నాం. పంట నష్టం వివరాలను ఉన్నతాధికారులకు నివేదిస్తా. – సుప్రజ, హార్టికల్చర్ అధికారి,
కాగజ్‌నగర్ డివిజన్

ఆయిల్‌పామ్‌కు పందుల బెడద