
వేతన వెతలు
నాలుగు నెలలుగా అందని జీతాలు అప్పులు చేసి కుటుంబ పోషణ ఆందోళనలకు సిద్ధమవుతున్న ఉపాధ్యాయులు జిల్లాలో 460 మంది సీఆర్టీలు
తిర్యాణి: గిరిజన సంక్షేమ శాఖలో పనిచేస్తున్న కాంట్రాక్టు రిసోర్స్ టీచర్ (సీఆర్టీ)లకు వేతనాలు అందకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. శాశ్వత ఉపాధ్యాయులకు ఏమాత్రం తీసిపోకుండా విధులు నిర్వహిస్తున్నా నెలనెల జీతాలు అందక అవస్థలు పడుతున్నారు. జిల్లాలోని గిరిజన సంక్షేమ శాఖ పరిధిలోని ఆశ్రమ, ప్రైమరీ పాఠశాలల్లో 460 మంది సీఆర్టీలుగా విధులు నిర్వహిస్తుండగా వారికి ఏప్రిల్, మే, జూన్, జూలై నెలలకు సంబంఽధించిన జీతాలు రాకపోవడంతో కుటుంబపోషణ భారంగా మారింది. కాగా జీతాలకు సంబంధించిన బడ్జెట్ పంపినప్పటికీ ఆర్థికశాఖ నుంచి వేతనాలు విడుదల కాలేదంటూ ట్రెజరీ అధికారులు చెబుతుండటంతో ఏం చేయాలో తెలియని, దిక్కు తోచని పరిస్థితుల్లో సీఆర్టీలు ఉన్నారు.
సీఆర్టీలదే కీలకపాత్ర..
ఆశ్రమ పాఠశాలల్లో విధులు నిర్వహించే సీఆర్టీలు విద్యార్థులకు మెరుగైన విద్య అందించడంలో కీలకపాత్ర పోషిస్తున్నారు. ఓ వైపు పాఠశాల సమయంలో విద్యా బోధన చేస్తూనే మరోవైపు రాత్రి పూట స్టడీఅవర్‌లను సైతం నిర్వహిస్తున్నారు. పదో తరగతిలో విద్యార్థులు ఆయా సబ్జెక్టుల్లో వందశాతం ఉత్తీర్ణత సాధించడం కోసం ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. చదువులో వెనుకబడిన విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపిస్తూ వారి ఉన్నతికి దోహద పడుతున్నారు. విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసం కష్టపడి విధులు నిర్వహిస్తున్నా తమకి నెలల వారీగా జీతాలు పెండింగ్ ఉంచడంపై మనస్తాపానికి గురవుతున్నారు. కుటుంబ షోషణ కోసం తెలిసిన వారందరి దగ్గర అప్పులు చేయాల్సిన దుస్థితి నెలకొందని, అప్పులు ఇచ్చిన వారికి ఎప్పుడు తిరిగి ఇస్తామో కూడా చెప్పలేక పోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఆందోళన బాట..!
నాలుగు నెలల వేతనాలు పెండింగ్‌లో ఉండటంతో సీఆర్టీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత (ఆగస్టు) నెలలో తమ సమస్యలు పరిష్కారం కాకపోతే పెద్దఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టడంతో పాటు అవసరమైతే నిరవధిక సమ్మెకు దిగాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. కాగా సీఆర్టీలకు ప్రతీనెల గ్రీన్ చానెల్ పద్ధతిలో వేతనాలు అందించాలని, మహిళా సీఆర్టీలకు ప్రసూతి సెలవులు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. గతంలో ఇచ్చిన హామీ మేరకు ఎంటీఎస్ (మినిమమ్ టైం స్కేల్) ను అమలు పర్చాలని, దశల వారీగా సర్వీసును రెగ్యులర్ చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతున్నారు.
విద్యాబోధన చేస్తున్న సీఆర్టీ