ప్రాథమిక ప్రణాళిక
రాష్ట్రంలో పైలట్ ప్రాజెక్టుగా ఖమ్మం ఎంపిక
పర్యాటకం, రవాణా, ఆహార శుద్ధి రంగాలపై దృష్టి
ప్రతీ శాఖకు నిర్దిష్ట లక్ష్యాలు, కార్యాచరణ
జిల్లాను అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్లేందుకు దశలవారీగా కార్యాచరణ చేపడతారు. ఈమేరకు కార్యక్రమాల రూపకల్పనకు రంగాల వారీగా 10 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. తలసరి ఆదాయాన్ని 2028 నాటికి రూ.5లక్షలు, 2033 నాటికి రూ.10 లక్షలకు పెంచేలా లక్ష్యాలను నిర్ణయించారు. ప్రతీ రంగంలో జిల్లాకు ఉన్న బలాలు, బలహీనతలు, అవకాశాలను గుర్తించి వాటికి అనుగుణంగా నిర్దిష్ట లక్ష్యాలను ఖరారు చేస్తారు. జిల్లా అభివృద్ధికి ప్రణాళికల రూపకల్పన పర్యవేక్షణకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌గా ఉన్న పనిచేసి ఉద్యోగ విరమణ పొందిన ఐఏఎస్ అఽధికారి టక్కర్‌ని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది.
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: విశాలమైన ఆర్థిక వ్యవస్థ, మెరుగైన తలసరి ఆదాయం, పేదరిక నిర్మూలన, సుసంపన్నమైన భవిష్యత్తే లక్ష్యంగా జిల్లా సమగ్రాభివృద్ధి కోసం ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. రాష్ట్ర సమగ్రాభివృద్ధిలో భాగంగా పైలట్ ప్రాజెక్టుగా ఎంపికై న జిల్లా అభివృద్ధిపై కార్యాచరణ రూపొందిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన విజన్–2047 డాక్యుమెంట్‌కు అనుగుణంగా రూపొందించే కార్యాచరణపై కలెక్టర్ దివాకర టీ.ఎస్. అధికారులకు ఇటీవల దిశానిర్దేశం చేశారు. ప్రతీ శాఖ తమ పరిధిలోని గణాంకాలు, వనరులు, ప్రస్తుత పరిస్థితులను విశ్లేషించి వాటికి అనుగుణంగా లక్ష్యాలను నిర్దేశించారు. జిల్లా పరిస్థితులను బేరీజు వేసుకుని పర్యాటకం, రవాణా, తయారీ, లాజిస్టిక్స్, ఆహారశుద్ధి, వ్యవసాయ అనుబంధ రంగాలపై ప్రత్యేక దృష్టి సారించనున్నారు.
10 సెక్టార్లుగా విభజన..
జిల్లా మొత్తాన్ని 10 సెక్టార్లుగా విభజించారు. ఉదాహరణకు వ్యవసాయం, ఉద్యానవనశాఖ, నీటిపారుదల శాఖ, విద్యుత్ శాఖలు కలిసి ఒక సెక్టార్, తయారీ, వైద్యం, శాంతిభద్రతలు.. ఇలా శాఖల వారీగా సెక్టార్లు చేశారు. ఒక్కో గ్రూపునకు నోడల్ ఆఫీసర్‌తోపాటు ఇతర అధికారులను నియమించారు. ప్రతీ సెక్టార్‌లోని రంగాల పరిస్థితి ప్రస్తుతం ఎలా ఉందో గుర్తించి, రెండేళ్ల స్వల్ఫ కాలిక, ఐదేళ్లు ఆపై దీర్ఘకాలిక లక్ష్యాలను నిర్దేశిస్తారు. అంటే ప్రస్తుతం 2.5 లక్షల ఎకరాలుగా ఉన్న ఆయకట్టును రాబోయే ఐదేళ్లలో 5లక్షల ఎకరాలకు పెంచడం, భూగర్భ జలాలు పుష్కలంగా ఉన్న మండలాల్లో బోర్ల ద్వారా సాగు విస్తీర్ణం పెంచడం వంటి అంశాలను పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం రూ.3.30 లక్షలుగా ఉన్న జిల్లా సగటు ఆదాయాన్ని రూ.10 లక్షలకు చేర్చడం లక్ష్యంగా పెట్టుకున్నారు. నిర్దేశిత లక్ష్యాలకు అనుగుణంగా ఆయా రంగాలకు అవసరమైన బడ్జెట్ కేటాయింపులు కోరడం, ప్రణాళికలను నిర్దిష్ట కాలపరిమితిలో అమలయ్యే ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తారు.
లక్ష్యాల నిర్ధారణ..
సెక్టార్ల వారీగా ఆ రంగంలో ప్రాథమికంగా ఉన్న పరిస్థితిని బేరీజు వేసుకుని లక్ష్యాన్ని నిర్ణయించుకుంటారు. అభివృద్ధి లక్ష్యాలకు అనుగుణంగా బడ్జెట్ ప్రతిపాదనలు పంపిస్తారు. జిల్లాలో వ్యవసాయ, అనుబంధ రంగాల నుంచి జిల్లాకు వస్తున్న ఆర్థిక వాటా ఇంకా మెరుగుపర్చడంపై దృష్టి సారించారు. ఈక్రమాన వ్యవసాయ రంగంలో ఉత్పాదకత పెంచడంతో పాటు రైతులు పండించే పంటలకు విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీ, ఆహార శుద్ధి కేంద్రాల ఏర్పాటును పరిశీలిస్తున్నారు. అంతేకాక లాజిస్టిక్స్ హబ్‌గా జిల్లాను తీర్చిదిద్దే అవకాశాలపై దృష్టి సారించారు. అలాగే, రవాణా, వాణిజ్య రంగాల్లో పెరుగుతున్న కార్యకలాపాలకు అనుగుణంగా మౌలిక వసతులు కల్పించడం, రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగాల పురోగతికి ఉన్న అవకాశాలను కూడా పరిగణనలోకి తీసుకుంటారు. ఇదే సమయాన తయారీ రంగంలో తగ్గుతున్న వృద్ధిని మెరుగు పరిచేందుకు చర్యలు చేపట్టేందుకు రంగం సిద్ధమవుతోంది.
తెలంగాణను 2035 నాటికి 3 ట్రిలియన్ ఎకానమీ కలిగిన రాష్ట్రంగా తీర్చిదిద్దనున్నట్లు లక్ష్యంతో ప్రకటించింది. ఇందుకు అనుగుణంగా జిల్లాలు కూడా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ప్రత్యేక ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. ప్రస్తుతం జిల్లా పైలట్ ప్రాజెక్టుగా ఎంపికై నందున డీడీపీ(డిస్ట్రిక్ట్ డెవలప్‌మెంట్ ప్లాన్) తయారవుతోంది. ఏయే రంగాల పరిస్థితి ఎలా ఉంది, ఆయా రంగాల్లో మరింత అభివృద్ధికి ఏమేం చేయాలన్న అంశాలను ప్రాథమికంగా నిర్ణయిస్తున్నారు. ఆతర్వాత కార్యాచరణను ఖరారు చేయనుండగా.. అన్ని జిల్లాల నుంచి వచ్చిన అభిప్రాయాలను క్రోడీకరించి ప్రభుత్వం లక్ష్యాలను వెల్లడించనుంది.
2033–34 నాటికి జిల్లాను మొదటి స్థానాన నిలిపేలా ప్రణాళిక


