ఐదేళ్ల క్రితం ప్రకటన.. ఇప్పుడు జమ | - | Sakshi
Sakshi News home page

ఐదేళ్ల క్రితం ప్రకటన.. ఇప్పుడు జమ

Nov 23 2026 5:36 AM | Updated on Nov 23 2026 5:36 AM

● భూసేకరణ పరిహారంపై రైతుల అసంతృప్తి ● పరిహారం పెంచండి.. లేకపోతే వడ్డీ చెల్లించాలని డిమాండ్‌ ● సీతారామ కాలువ పనులను అడ్డుకున్న అన్నదాతలు

● భూసేకరణ పరిహారంపై రైతుల అసంతృప్తి ● పరిహారం పెంచండి.. లేకపోతే వడ్డీ చెల్లించాలని డిమాండ్‌ ● సీతారామ కాలువ పనులను అడ్డుకున్న అన్నదాతలు

కారేపల్లి: సీతారామ ప్రాజెక్టు కాలువ నిర్మాణ పనులను సింగరేణి మండలం కమలాపురం రైతులు ఆదివారం అడ్డుకున్నారు. భూసేకరణకు సంబంధించి 2021లో నిర్ణయించిన పరిహారాన్నే ఇప్పుడు జమ చేయడం సరికాదని, ప్రస్తుత మార్కెట్‌ విలువ ప్రకారం పరిహారం చెల్లించాలని వారు డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో నాటి పరిహారాన్ని వడ్డీతో సహా ఇవ్వాలని స్పష్టం చేశారు. అంతేకాక సాగులో ఉన్న వరి, పత్తి పంటలు చేతికొచ్చే వరకు పనులు నిలిపివేయాలని పట్టుపట్టారు.

2021లో రూ.10.50లక్షల చొప్పున ప్రకటన

సీతారామ కాల్వ నిర్మాణానికి కమలాపురంలోని 45 మంది రైతుల నుంచి 54 ఎకరాల భూమిని 2021లో అధికారులు సేకరించారు. అప్పట్లో ఎకరాకు రూ.10.50లక్షల చొప్పున పరిహారం ప్రకటించినా నగదు అందకపోవడంతో రైతులు సాగు కొనసాగిస్తున్నారు. చివరకు ఐదేళ్ల తర్వాత ఈ ఏడాది ఆగస్టు 25న పరిహారం మొత్తాన్ని రైతుల ఖాతాల్లో జమ చేశారు. అయితే, ప్రస్తుత మార్కెట్‌ విలువను పరిగణనలోకి తీసుకోకుండా ఐదేళ్ల క్రితం నాటి పరిహారాన్ని జమ చేయడం, ప్రస్తుతం సాగులో ఉన్న పంటలు చేతికొచ్చే సమయాన పనులకు సిద్ధం కావడం రైతుల ఆగ్రహానికి కారణమైంది. ఈ మేరకు ఆదివారం తీసుకొచ్చిన వాహనాలను రైతులు అడ్డుకున్నారు.

మాపై ఎందుకు వివక్ష

2021లో నిర్ణయించిన పరిహారం కాకుండా, ప్రస్తుత మార్కెట్‌ విలువ ప్రకారం నష్టపరిహారం ఇవ్వాలని రైతులు కోరారు. ఇదే ప్రాజెక్టు పనులకు గాను కామేపల్లి మండలం లింగాల గ్రామాలకు చెందిన రైతులకు రూ.19.25లక్షల చొప్పున పరిహారం చెల్లించి, తమను పరిగణనలోకి తీసుకోకపోవడం సరికాదని వాపోయారు. అంతేకాక పరిహారం ప్రకటించిన మూడేళ్లలో చెల్లించకపోతే 12శాతం వడ్డీ కలిపి ఇవ్వాలనే నిబంధన ఉందని తెలిపారు. భూమినే నమ్ముకున్న తమకు న్యాయం చేయాలని వారు పనులను అడ్డుకోవడంతో వాగ్వాదం జరిగింది.

ఆదేశాలు రాలేదు..

కాల్వ నిర్మాణ పనుల కోసం ఇప్పటికే 54 ఎకరాల భూమిని రెవెన్యూ శాఖ తమ శాఖకు అప్పగించగా, ఆగస్టులో ప్రభుత్వం రైతుల ఖాతాల్లో పరిహారాన్ని జమ చేసిందని జల వనరుల శాఖ ఏఈ సందీప్‌ తెలిపారు. కానీ పరిహారం సరిపోలేదని రైతులు కోర్టును ఆశ్రయించినప్పటికీ, తమకు ఎలాంటి ఆదేశాలు రాలేదని చెప్పారు. ఈక్రమాన కాల్వ నిర్మాణ పనులు చేపట్టేందుకు సిద్ధమయ్యామని పేర్కొన్నారు. ఈ క్రమంలో వైరా ఎమ్మెల్యే రాందాస్‌ నాయక్‌ బాధిత రైతులతో ఫోన్‌ మాట్లాడి పరిస్థితిని చక్కదిద్దారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement