బీమా దరఖాస్తుల స్వీకరణ మాత్రమే... | - | Sakshi
Sakshi News home page

బీమా దరఖాస్తుల స్వీకరణ మాత్రమే...

Nov 23 2026 5:36 AM | Updated on Nov 23 2026 5:36 AM

అమలు తేదీపై త్వరలోనే ప్రభుత్వ ప్రకటన

ఖమ్మం సహకారనగర్‌: అర్హులైన వారికి ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని వర్తింపజేసేలా ప్రస్తుతం దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతోందని కలెక్టర్‌ దివాకర టీ.ఎస్‌. వెల్లడించారు. ప్రస్తుతం అర్హులైన వారి నుంచి కేవలం దరఖాస్తుల స్వీకరణ, ఆన్‌లైన్‌లో నమోదు మాత్రమే జరుగుతోందని తెలిపారు. ఈ ప్రక్రియ పూర్తయ్యాక అర్హత సాధించిన లబ్ధిదారులకు విషయాన్ని అధికారికంగా తెలియజేయనున్నట్లు పేర్కొన్నారు. అయితే, పథకం కింద బీమా కవరేజీ ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుంది, లబ్ధిదారులు ఎప్పటి నుంచి క్లెయిమ్‌లు చేసుకోవచ్చనే తేదీని రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే వెల్లడిస్తుందని, ఈ విషయంలో ప్రజలు అపోహలకు లోనుకాకుండా తమ వివరాలను నమోదు చేసుకోవాలని కలెక్టర్‌ ఓ ప్రకటనలో సూచించారు.

నేటి ప్రజావాణి రద్దు

ఖమ్మం సహకారనగర్‌: ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రతీ సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించే ప్రజావాణి(గ్రీవెన్స్‌ డే) కార్యక్రమాన్ని ఈ వారం పరిపాలనా అవసరాల దృష్ట్యా రద్దు చేసినట్లు కలెక్టర్‌ దివాకర టీ.ఎస్‌. ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా అధికారులు కలెక్టరేట్‌లో అందుబాటులో ఉండకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. అయితే, ప్రజలు వారి సమస్యలకు సంబంధించి దరఖాస్తులను కలెక్టరేట్‌లోని కౌంటర్లలో సమర్పించవచ్చని తెలిపారు.

వెబ్‌సైట్‌లో ‘నవోదయ’ అడ్మిట్‌ కార్డులు

కూసుమంచి: పాలేరులోని జవహర్‌ నవోదయ విద్యాలయలో వచ్చే విద్యా సంవత్సరం ఆరో తరగతిలో ప్రవేశానికి ఈనెల 28న పరీక్ష నిర్వహించనున్నారు. ఇందుకోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు అడ్మిట్‌ కార్డులు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయని ఇన్‌చార్జ్‌ ప్రిన్సిపాల్‌ వెంకటరమణ తెలిపారు. విద్యార్థులు వీటిని డౌన్‌లోడ్‌ చేసుకోవాలని పరీక్షకు హాజరుకావాలని సూచించారు. అంతేకాక ఆధార్‌ కార్డు, నివాస ధ్రువీకరణ పత్రం తో పాటు ప్యాడ్‌, బ్లూ లేదా బ్లాక్‌ పెన్‌తో పరీక్షా కేంద్రానికి ఉదయం 10–30 గంటలకల్లా చేరుకోవాలని ఆయన తెలిపారు.

విజయవంతంగా

క్లిష్టమైన శస్త్రచికిత్స

మెలికపడిన పెద్దపేగును సరిచేసిన

జీజీహెచ్‌ వైద్యులు

ఖమ్మం వైద్యవిభాగం: ఖమ్మం ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రి వైద్యులు అత్యంత క్లిష్టమైన శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు. మహబూబాబాద్‌ జిల్లా గార్ల మండలం చంద్రగిరి గ్రామానికి చెందిన బి.శిరీష(29) మూడు రోజులుగా తీవ్రమైన కడుపునొప్పి, కడుపు ఉబ్బరం వంటి సమస్యలతో బాధపడుతోంది. ఆమెను కుటుంబ సభ్యులు పెద్దాస్పత్రికి తీసుకురాగా సీటీ స్కాన్‌ నిర్వహించిన వైద్యులు పెద్దపేగు మెలికలు పడడంతో అవరోధం ఏర్పడిందని గుర్తించారు. దీంతో ఆదివారం ఆపరేషన్‌ నిర్వహించి మెలికలు పడిన పెద్దపేగును సరిచేయడంతో పాటు దెబ్బతిన్న భాగాన్ని తొలగించి తిరిగి అనుసంధానం చేశారు. అలాగే, ఎడమ వైపు పెద్ద పరిమాణంలో ఉన్న హైడ్రోసాల్పింక్స్‌ తొలగించారు. క్లిష్టమైన శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తిచేసిన సర్జరీ విభాగం హెచ్‌ఓడీ కిరణ్‌ కుమార్‌, అసోసియేట్‌ ప్రాఫెసర్‌ రమేష్‌, డాక్టర్‌ శ్రీలత, సిబ్బందిని ఆస్పత్రి సూపరింటెండెంట్‌ నరేందర్‌ అభినందించారు. ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రిలో అనుభవజ్ఞులైన వైద్యులు, ఆధునిక వైద్య పరికరాలు, సదుపాయాలు ఉండడంతో నాణ్యమైన వైద్య సేవలు అందిస్తున్నామని తెలిపారు.

రాష్ట్ర హ్యాండ్‌బాల్‌ జట్టుకు

ముగిసిన శిక్షణ

ఖమ్మం స్పోర్ట్స్‌: జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొననున్న రాష్ట్ర బాలికల హ్యాండ్‌బాల్‌ జట్టు శిక్షణ శిబిరం ఆదివారం ముగిసింది. ఈ జట్టుకు వారం పాటు ఖమ్మంలో హ్యాండ్‌బాల్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యాన శిక్షణ ఇచ్చారు. ఈమేరకు జట్టు పంజాబ్‌ రాష్ట్రం మస్తువానాలో ఈనెల 25నుంచి జరిగే జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొననుందని హ్యాండ్‌బాల్‌ అసోసియేషన్‌ జిల్లా కార్యదర్శి వరికూటి మోహన్‌ తెలిపారు. ఈ సందర్భంగా అసోసియేషన్‌ బాధ్యులు, పీడీలు నెమలిపురి సీతారామారావు, ముత్తినేని సురేష్‌, నున్నా.రాధాకృష్ణ, తంబి, సుధీర్‌, డాక్టర్‌ వి.శివకృష్ణ, నాగేశ్వరరావు, సుందరం, రామాంజనేయు, దాసరి బలరాం, కోపెల ప్రవీణ్‌ తదిరులు పాల్గొని జట్టుకు శుభాకాంక్షలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement