మురసు తుపాన్‌తో 23 వేల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్లు అంచనా
ఇప్పటి వరకు కేవలం
545 ఎకరాల్లోనే పరిశీలన
క్షేత్రస్థాయి సిబ్బంది లేక
సర్వేలో తీవ్ర జాప్యం
ఎల్‌నినో ప్రభావం జిల్లాలో పంటల దిగుబడిపై పడింది. అంతంత మాత్రంగానే వస్తున్న పంటలనైనా అమ్ముకుంటే పెట్టుబడిఅయినా దక్కుతుందని రైతులు భావిస్తుండగా తుపాన్లు తుడిచి పెట్టేశాయి. ఈక్రమాన దెబ్బతిన్న పంటలకు పరిహారం అందుతుందని అన్నదాతలు ఆశించారు. కానీ దెబ్బతిన్న పంటల సర్వే నత్తనడకన సాగుతుండడంతో వారిలో ఆవేదన వ్యక్తమవుతోంది. – సాక్షి ప్రతినిధి, ఖమ్మం
జిల్లాపై వెంటవెంటనే పడిన అర్నబ్, మురసు తుపాన్లు పంటలను ఊడ్చేశాయి. కోత దశలో ఉన్న వరితో పాటు తుది దశకు చేరిన పత్తి, మిర్చి పంటలు నీటి పాలయ్యాయి. చేలన్నీ చెరువులను తలపించి కోసిన ధాన్యం నానిపోయింది. పలు వరి కంకులు నేలవాలి మొలకెత్తాయి. నేలవాలిన వరిని కోసేందుకు మరింత ఖర్చు చేయాల్సి వచ్చింది. ఇక పత్తి తడిసిపోవడంతో కాయల నుంచి కిందకు పడిపోతోంది. చేతికొచ్చే దశలో పంట కుళ్లిపోతోందని రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు.
మురసు తుపాను ధాటికి వరి, పత్తి, మిర్చితో పాటు ఇతర పంటలు కలిపి 23,140 ఎకరాల్లో దెబ్బతిన్నాయని వ్యవసాయాధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. ఇందులో అత్యధికంగా 19,580 ఎకరాల్లో వరి పంట నేలవాలింది. పూర్తిస్థాయిలో నష్టం అంచనాలను రూపొందించేందుకు ప్రభుత్వ ఆదేశాలతో అధికారులు రంగంలోకి దిగారు. అయితే, తుపాన్ ముగియగానే అధికారులు ప్రాథమిక అంచనాలు ప్రకటించడంతో సర్వే కూడా త్వరగా పూర్తవుతుందని రైతులు భావించారు. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం అలా కనిపించడం లేదు. ప్రాథమిక అంచనాల మేరకే అయినా 23,140 ఎకరాల్లో సర్వే చేయాల్సి ఉంటే.. ఇప్పటి వరకు కేవలం 545 ఎకరాల్లో పూర్తి చేయడం గమనార్హం. ఇదికాక పూర్తిస్థాయిలో సర్వేచేస్తే నష్ట తీవ్రత పెరిగే అవకాశముందని రైతులు చెబుతున్నారు.
ప్రాథమికంగా అంచనా వేసిన పంటలే కాక తుపాన్ ప్రభావం పడిన అన్ని ప్రాంతాల్లో సర్వే చేయాలని, అప్పుడే బాధితులకు న్యాయం జరుగుతుందని రైతులు కోరుతున్నారు. కానీ వాస్తవ పరిస్థితిని పరిశీలిస్తే ఎంత సమయం పడుతుందో తెలియడం లేదు. దీంతో రైతులు ఎదురుచూస్తే నేలవాలిన వరి నాని మొలకెత్తే అవకాశముండడంతో పంటను తొలగిస్తున్నారు. ఇప్పటికే తుపాన్ ముగిసి ఎనిమిది రోజులు దాటినందున పంట కోశాక సర్వే ఎలా చేస్తారు, నష్టాన్ని ఎలా అంచనా వేస్తారు, పరిహారం ఏ లెక్కన ఇస్తారనే ప్రశ్నలు వస్తున్నాయి.
వ్యవసాయ శాఖలో సిబ్బంది కొరత కారణంగా సర్వేలో జాప్యం చోటు చేసుకుంటోంది. కల్లూరు మండలంలో ఆరుగురు ఏఈఓలకు గాను ఇద్దరు మెటర్నటీ సెలవులో, మరొకరు అనారోగ్యంతో సెలవులో ఉన్నారు. ఇంకో ఏఈఓ ఉద్యోగానికి రాజీనామా చేశాడు. దీంతో మిగిలిన ఇద్దరు వరి ఎక్కువగా సాగయ్యే ఈ మండలంలో 38 వేల ఎకరాలను ఎప్పుడు సర్వే చేస్తారన్నది అంతుబట్టడం లేదు. కాగా, పంటలకు 33 శాతం నష్టం ఎదురైతేనే యాప్‌లో నమోదు చేయాలనే నిబంధన వల్ల చాలా చోట్ల నష్టం వివరాలను అప్‌లోడ్ చేయడం లేదు.
పంట నష్టంపై
సా..గుతున్న సర్వే


