● ‘చేయూత’ పింఛన్ల మంజూరు పత్రాలు పంపిణీ చేయనున్న మంత్రి
ఖమ్మంమయూరిసెంటర్/ఖమ్మం రూరల్: రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శుక్రవారం పాలేరు నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు నేలకొండపల్లి మార్కెట్ యార్డ్‌లో జరిగే సమావేశంలో చేయూత పెన్షన్ లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందజేస్తారు. మధ్యాహ్నం 12 గంటలకు ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని టీసీవీ రెడ్డి ఫంక్షన్ హాల్‌లో ఎకై ్సజ్ శాఖ ఆధ్వర్యాన విద్యార్థులకు నిర్వహించే క్విజ్ పోటీలకు ముఖ్య అతిథిగా హాజరవుతారు. అలాగే, మధ్యాహ్నం 3గంటలకు ఖమ్మం రూరల్ మండలం ఎం.వీ.పాలెం జిల్లా పరిషత్ పాఠశాల, సాయంత్రం 4–30 గంటలకు కూసుమంచి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగే సమావేశాల్లో మంత్రి పాల్గొని కొత్త పెన్షన్ లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేస్తారని క్యాంపు కార్యాలయ ఇన్‌చార్జ్ టి.దయాకర్‌రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు.
ఉత్తమ ప్రిన్సిపాల్‌గా సీతామహాలక్ష్మి
● సీఎం చేతుల మీదుగా పురస్కారం
ఖమ్మంఅర్బన్: మైనార్టీ గురుకుల పాఠశాలలు, కళాశాలల విభాగంలో ఖమ్మం బాలికల గురుకులం–2 ప్రిన్సిపాల్ పొలిమెట్ల సీతామహాలక్ష్మి రాష్ట్రస్థాయి ఉత్తమ ప్రిన్సిపాల్‌గా ఎంపికయ్యారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన సమావేశంలో ఆమెకు సీఎం రేవంత్‌రెడ్డి పురస్కారం అందజేశారు. విద్యార్థినులకు నాణ్యమైన విద్య అందించడమే కాక విద్యా ప్రమాణాల పెంపు, క్రమశిక్షణ, సంక్షేమం, అభివృద్ధికి చేసిన కృషికి గుర్తింపుగా అవార్డు లభించింది. పురస్కారం అందుకున్న ఆమెను జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి ముజాహిద్, ఆర్‌సీఓ కె.వెంకటరామయ్య, విజిలెన్స్ అధికారులు సీతారాములు, రవూఫ్, అధ్యాపకులు అభినందించారు.
హక్కులు, చట్టాలపై మహిళలకు అవగాహన
● డీఎల్‌ఎస్‌ఏ కార్యదర్శి దేవీమానస
ఖమ్మం లీగల్: మహిళలు తమ సంరక్షణకు ఉన్న చట్టాలు, హక్కులపై అవగాహన పెంచుకోవాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి పి.దేవీమానస సూచించారు. న్యాయ సేవల దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా ఖమ్మంలోని సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో గురువారం నిర్వహించిన సదస్సులో ఆమె మాట్లాడారు. మహిళలు తమ హక్కులపై అవగాహన పెంచుకుని, చట్టాలు కల్పించిన రక్షణను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. జిల్లా బాలల పరిరక్షణ అధికారి విష్ణువందన, ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్.దీపతో పాటు కాలేజీ అధ్యాపకులు పాల్గొన్నారు.
నాలుగు జిల్లాల
మత్స్యకారులకు శిక్షణ
కూసుమంచి: కూసుమంచి మండలం పాలేరులోని మత్స్య పరిశోధన కేంద్రంలో మత్స్యకారులకు ఇచ్చే నాలుగు రోజుల శిక్షణ గురువారం ప్రారంభమైంది. రాజన్న సిరిసిల్ల, సూర్యాపేట, నల్లగొండ, ఖమ్మం జిల్లాలకు చెందిన మత్స్య రైతులు, మత్స్యకారులు పాల్గొనగా ఏపీలోని మత్స్య కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఆనంద్‌ప్రసాద్ మాట్లాడారు. రోజురోజుకు మంచినీటి చేపలకు డిమాండ్ పెరుగుతోందని, తెలంగాణలో మంచినీటి వనరులు అందుబాటులో ఉన్నందున మత్స్యకారులు చేపల పెంపకంలో శాసీ్త్రయ పద్ధతులు, యాజమాన్య విధానాలు పాటించాలని సూచించారు. తద్వారా దిగుబడిని రెట్టింపు అవుతుందని తెలిపారు. అనంతరం సమీకృత పద్ధతిలో చేపలతో పాటు కోళ్లు, మేకలు, బాతులు, ఆవుల పెంపకంపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పాలేరు పరిశోధన కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ శ్యాంప్రసాద్, శాస్త్రవేత్తలు రవీందర్, శాంతన్న, దివ్య తదితరులు పాల్గొన్నారు.


