తరగతులే తరువాయి.. | - | Sakshi
Sakshi News home page

తరగతులే తరువాయి..

Nov 13 2026 12:34 AM | Updated on Nov 13 2026 12:34 AM

● నర్సింగ్‌ కళాశాల ప్రారంభానికి సన్నాహాలు ● ఇప్పటికే పూర్తయిన ప్రవేశాల ప్రక్రియ ● వచ్చేనెల మొదటి వారం నుంచి బోధన డిసెంబర్‌ మొదటి వారంలో తరగతులు గ్రామీణ విద్యార్థులకు వరం

● నర్సింగ్‌ కళాశాల ప్రారంభానికి సన్నాహాలు ● ఇప్పటికే పూర్తయిన ప్రవేశాల ప్రక్రియ ● వచ్చేనెల మొదటి వారం నుంచి బోధన

చింతకాని: చింతకాని మండలానికి మంజూరైన ప్రభుత్వ నర్సింగ్‌ కళాశాల ప్రారంభానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. పేద, మధ్య తరగతి కుటుంబాల్లోని విద్యార్థులకు నాణ్యమైన ఉచిత వైద్య విద్యను అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చొరవ తీసుకుని కళాశాలను మంజూరు చేయించారు. కళాశాలలో ఈ విద్యాసంవత్సరం నుంచే తరగతులను ప్రారంభించాలని నిర్ణయించగా, బుధవారంతో ప్రవేశాల ప్రక్రియ పూర్తయింది. ఇందులో భాగంగా 60మంది విద్యార్థులకు ప్రవేశాలు కల్పించారు.

తాత్కాలికంగా మినీ స్టేడియంలో..

చింతకాని మండలానికి మంజూరైన ప్రభుత్వ నర్సింగ్‌ కళాశాలకు అవసరమైన శాశ్వత భవనాల నిర్మాణానికి లచ్చగూడెంలోని ఆరు ఎకరాల ప్రభుత్వ భూమిని గుర్తించారు. ఇప్పటికే అక్కడ డిప్యూటీ భట్టి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అయితే, ఈ ఏడాదే తరగతులు ప్రారంభించాలని నిర్ణయించిన నేపథ్యాన లచ్చగూడెంలో నిరుపయోగంగా ఉన్న మినీ స్టేడియం భవనాలను కేటాయించారు. తరగతి గదులు, ప్రయోగశాల, హాస్టల్‌, మెస్‌లతో ఇతర వసతులు కల్పించేందుకు ప్రభుత్వం కేటాయించిన రూ.50 లక్షలతో మినీ స్టేడియం భవనాల్లో పనులు చురుగ్గా జరుగుతున్నాయి. ప్రవేశాల ప్రక్రియ కూడా పూర్తయిన నేపథ్యాన అవసరమైన వసతులు అందుబాటులోకి రాగానే వచ్చేనెల మొదటి వారం నుంచి బోధన ప్రారంభించనున్నారు.

కాలేజీలో 60మంది విద్యార్థులు చేరడంతో ప్రవేశాల ప్రక్రియ ముగిసింది. తరగతుల నిర్వహణకు తాత్కాలికంగా మినీ స్టేడియంలో ఏర్పాట్లు చేస్తున్నాం. పనులు చివరి దశకు చేరినందున మొదటి బ్యాచ్‌కు డిసెంబర్‌ మొదటి వారంలో బోధన ప్రారంభిస్తాం.

– డాక్టర్‌ పి.రాజమణి, కాలేజీ ప్రిన్సిపాల్‌

ఇక్కడ ప్రభుత్వ నర్సింగ్‌ కళాశాల ఏర్పాటు చేయడం గ్రామీణ ప్రాంత విద్యార్థులకు వరం. కాలేజీ మంజూరు చేసిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు కృతజ్ఞతలు. ఈ కాలేజీతో వైద్యవిద్య అభ్యసించాలనుకునే పేద, మధ్య తరగతి విద్యార్థుల కల నెరవేరుతుంది.

– కొప్పుల రజని, సర్పంచ్‌, లచ్చగూడెం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement