ప్రభుత్వ హాస్టళ్లలో
తప్పుడు హాజరుకు చెక్
అన్ని వసతిగృహాల్లో అమల్లోకి
ఎఫ్‌ఆర్‌ఎస్
దసరా సెలవుల అనంతరం
నూతన విధానం
పకడ్బందీగా అమలు..
ఖమ్మంమయూరిసెంటర్: ప్రభుత్వ సంక్షేమ శాఖల వసతి గృహాల్లోని విద్యార్థుల హాజరు నమోదులో అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం సాంకేతిక విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇన్నాళ్లు హాజరుపట్టికలు, గూగుల్ షీట్లలో నమోదు చేస్తుండగా, ఇప్పుడు ఎఫ్‌ఆర్‌ఎస్(ఫేస్ రికగ్నైజేషన్ సిస్టమ్)ను అమలుచేస్తున్నారు. దసరా సెలవుల అనంతరం ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో నడుస్తున్న అన్ని వసతిగృహాల్లో ఈ విధానాన్ని తప్పనిసరి చేస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి.
అక్రమార్కులకు చెక్
హాస్టళ్లలో ఉన్న విద్యార్థుల సంఖ్యకు మించి నమోదు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఆపై వారి పేరిట మెస్, కాస్మోటిక్ చార్జీలు, ఇతర నిధులను పక్కదోవ పట్టిస్తూ ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్నట్లు తెలియడంతో ప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమించింది. ఇందులో భాగంగా హాస్టల్‌లో విద్యార్థి ఉన్న విద్యార్థి ముఖాన్ని చిత్రిస్తేనే హాజరు నమోదు కానుంది. తద్వారా వసతిగృహాల నిర్వహణలో పారదర్శకత ఉంటుందని, అక్రమాలకు చెక్ పడుతుందని భావిస్తున్నారు.
కఠిన నిర్ణయాలు..
గతంలో గిరిజన సంక్షేమ శాఖ పరిధి హాస్టళ్లలో ఎఫ్‌ఆర్‌ఎస్‌ను ప్రయోగాత్మకంగా ప్రారంభించినా పర్యవేక్షణ లోపం, కొందరు వసతిగృహ సంక్షేమ అధికారుల నిర్లక్ష్యంతో ముందుకు సాగలేదు. కొన్నాళ్లు బయోమెట్రిక్ (వేలిముద్రల) విధానం అమలుచేసినా సాంకేతిక లోపాలతో ఆశించిన ఫలితాలు రాలేదు. కానీ ఈసారి ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ శాఖల్లోనూ కచ్చితంగా సర్వర్ ఆధారిత యాప్ ద్వారా ఎఫ్‌ఆర్‌ఎస్ హాజరు నమోదు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.
జియో ఫెన్సింగ్ అనుసంధానం
ఎఫ్‌ఆర్‌ఎస్‌లోనూ వసతిగృహ సంక్షేమ అధికారులు అవకతవకలకు పాల్పడేందుకు అవకాశం ఉండడంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎఫ్‌ఆర్‌ఎస్ యాప్‌ను హాస్టల్ ప్రాంగణంలోని జియో – కోఆర్డినేట్లతో అనుసంధానిస్తున్నారు. తద్వారా వార్డెన్, విద్యార్థి హాస్టల్ ప్రాంగణంలో ఉంటేనే హాజరు నమోదవుతుంది. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం విద్యార్థుల ముఖ గుర్తింపుతో పాటు సమయం, తేదీ ఆధారంగా నమోదు చేసే హాజరు నేరుగా రాష్ట్రస్థాయి డ్యాష్‌బోర్డ్‌కు అప్‌లోడ్ అవుతుంది. ఈక్రమంలో కొందరు చొప్పున విద్యార్థులను గ్రూప్‌గా ఏర్పాటుచేసి హాజరును నమోదు చేస్తున్నారు. దీంతో ప్రతిఒక్కరి ఫొటో పక్కన పేరు నమోదవుతోంది. ఫలితంగా ఏఐ ఆధారిత, పాస్ ఫొటోలు అప్‌లోడ్ చేయకుండా కట్టడి చేసినట్టవుతుందని చెబుతున్నారు.
పర్యవేక్షణకు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్
త్వరలోనే జిల్లాల వారీగా తనిఖీలకు టాస్క్‌ఫోర్స్ కమిటీలను ఏర్పాటు చేయనున్నారు. వీరు ప్రతిరోజూ ఆన్‌లైన్ హాజరును, హాస్టళ్లతో ఉన్న విద్యార్థుల సంఖ్యను సరిపోల్చనున్నట్లు తెలిసింది. ఎక్కడైనా తేడా వస్తే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర స్థాయి అధికారులు హెచ్చరిస్తున్నారు. అయితే, ఎఫ్‌ఆర్‌ఎస్ హాజరు విధానం పకడ్బందీగా కొనసాగేలా అసిస్టెంట్ వెల్ఫేర్ ఆఫీసర్లు(ఏస్‌డబ్ల్యూఓ) హాస్టళ్లను పర్యవేక్షించాల్సిన అవసరముంది. వీరు కార్యాలయాలు పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో పర్యటిస్తే ప్రభుత్వ లక్ష్యం నెరవేరే అవకాశముంటుంది. హాజరుతో పాటు నాణ్యమైన మెనూ అమలులోనూ అవకతవకలను అరికట్టడం సాధ్యమవుతుంది.
జిల్లాలోని ఎస్సీ, బీసీ సంక్షేమ శాఖల్లో ఎఫ్‌ఆర్‌ఎస్ విధానాన్ని పకడ్బందీగా అమలు చేస్తున్నాం. ఇప్పటి వరకు 70 శాతం హాజరు ఎఫ్‌ఆర్‌ఎస్ ద్వారానే నమోదవుతోంది. వారం పది రోజుల్లో 90 శాతానికి చేరుస్తాం. ఎఫ్‌ఆర్‌ఎస్ విధానంలో హాజరు నమోదుపై ఆన్‌లైన్ ద్వారా వార్డెన్లకు ఇప్పటికే శిక్షణ ఇచ్చాం. త్వరలోనే క్షేత్ర స్థాయిలో పరిశీలన చేస్తాం.
– జి.జ్యోతి, డీడీ, బీసీ, ఎస్సీ సంక్షేమ శాఖలు


