ఖమ్మంక్రైం: కేసుల దర్యాప్తులో సాంకేతికతను వినియోగిస్తూ పకడ్బందీ సాక్ష్యాధారాలు సేకరించడం ద్వారా నిందితులకు శిక్ష పడేలా కృషి చేయాలని, తద్వారా బాధితులకు న్యాయం జరుగుతుందని పోలీసు కమిషనర్ సునీల్‌దత్ తెలిపారు. ఖమ్మంలో గురువారం జరిగిన నేరసమీక్షా సమావేశంలో సీపీ మాట్లాడుతూ కేసుల ట్రయల్ ప్రక్రియలో అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ లోటుపాట్లను సరిదిద్దుకోవాలని సూచించారు. కేసులకు సంబంధించిన సాక్ష్యాధారాలను ఈ–సాక్ష్య యాప్‌లో నమోదు చేసి దర్యాప్తు త్వరగా పూర్తయ్యేలా చూడాలని తెలిపారు. రోడ్డు ప్రమాద బాధితులకు పీఎం రహత్ పథకం ద్వారా ప్రభుత్వం గరిష్టంగా రూ.1.50లక్షల వరకు నగదు రహిత వైద్యం అందించే విషయమై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని ఆదేశించారు. అలాగే, గంజాయి వినియోగదారులు పట్టుబడినప్పుడు సరఫరా వెనుక మూలాలను వెలికితీయాలని తెలిపారు. అంతేకాక సరిహద్దు రాష్ట్రాల నుంచి ఇసుక అక్రమ రవాణాపై నిఘా వేసి చెక్‌పోస్టుల వద్ద తనిఖీలు ముమ్మరం చేయాలని, సరైన పత్రాలు లేని వాహనాల అమ్మకం విషయంలో దృష్టి సారించాలని చెప్పారు. ఈసమావేశంలో అడిషనల్ డీసీపీలు రామానుజం, ఏసీపీలు రమణమూర్తి, తిరుపతిరెడ్డి, శ్రీనివాసులు సాంబరాజు, నరసింహారావు, సర్వర్, సత్యనారాయణతో పాటు సీఐలు పాల్గొన్నారు.
ప్రజలకు నాణ్యమైన సేవలే లక్ష్యం
వైరా: పోలీసు ఉద్యోగులు విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉంటూ కేసుల దర్యాప్తులో వేగం పెంచడమే కాక ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలని పోలీసు కమిషనర్ సునీల్‌దత్ సూచించారు. వైరా పోలీసుస్టేషన్‌ను గురువారం తనిఖీ చేసిన ఆయన పెండింగ్ కేసులు, దర్యాప్తు స్థితిగతులను పరిశీలించారు. కేసుల పురోగతిపై అధికారులు నిత్యం పర్యవేక్షిస్తూ సాంకేతికత సాయంతో ఆధారాలు సేకరించి కోర్టులో చార్జీషీట్లు దాఖలు చేయాలని తెలిపారు. తద్వారా నిందితులకు శిక్షల శాతం పెరుగుతుందని చెప్పారు. అంతేకాక సమస్యలతో స్టేషన్‌కు వచ్చే వారితో మర్యాదగా వ్యవహరించాలని, మాదక ద్రవ్యాల అమ్మకం, కట్టడి, రహదారి భద్రత చర్యలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. అనంతరం వివిధ సమస్యలపై వచ్చిన వారితో సీపీ మాట్లాడి ఫిర్యాదులు స్వీకరించారు. వైరా సీఐ వెంకటప్రసాద్, ఎస్‌ఐ ప్రవీణ్, సిబ్బంది పాల్గొన్నారు.
పోలీసు కమిషనర్ సునీల్‌దత్


