నేడు మంత్రి పొంగులేటి పర్యటన | - | Sakshi
Sakshi News home page

నేడు మంత్రి పొంగులేటి పర్యటన

Nov 3 2026 12:39 AM | Updated on Nov 3 2026 12:39 AM

ఖమ్మం మయూరిసెంటర్‌/తిరుమలాయపాలెం: రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంగళవారం జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 11గంటలకు కూసుమంచి మండలం గంగబండతండాలో నిర్మించే వంద పడకల ఆస్పత్రి స్థలాన్ని పరిశీలించనున్న మంత్రి, ఆ తర్వాత ఏదులాపురం మున్సిపాలిటీ పరిధి తెల్దారుపల్లి చావిడి సెంటర్‌లో అంతర్గత సీసీ రోడ్డు నిర్మాణాలకు శంకుస్థాపన చేస్తారు. మధ్యాహ్నం 2–30 గంటలకు తిరుమలాయపాలెం మండలం దమ్మాయిగూడెంలో ఇందిరమ్మ రెండో విడత లబ్ధిదారులకు ఇళ్ల మంజూరు పత్రాలు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ లబ్ధిదారులకు చెక్కులు అందజేస్తారు. ఆతర్వాత సాయంత్రం ఏలువారిగూడెంలో బీటీ రోడ్డు. బీరోలులో ఓవర్‌ హెడ్‌ సర్వీస్‌ రిజర్వాయర్‌ నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేయనున్నారు.

ల్యాబ్‌ టెక్నీషియన్లకు శిక్షణ

ఖమ్మం వైద్యవిభాగం: జిల్లాలోని ల్యాబ్‌ టెక్నీషియన్లకు మలేరియా, ఇతర వ్యాధులకు సంబంధించి పరీక్షలపై శిక్షణ ఇచ్చారు. ఖమ్మంలోని పాత డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో సోమవారం మలేరియా నిర్మూలనలో భాగంగా పరీక్షలు, విధులపై అవగాహన కల్పించారు. రక్తనమూనాల సేకరణ, పరీక్ష, నివేదికలపై శిక్షణ ఇచ్చారు. ఈకార్యక్రమంలో డీఎంఓ వెంకటేశ్వర్లు, ఏఎంఓ వేణుగోపాల్‌ పాల్గొన్నారు.

‘దుమ్ముగూడెం’ వద్ద

పెరుగుతున్న నీటి మట్టం

అశ్వాపురం: ఎల్‌నినో ప్రభావంతో రాబోయే రోజుల్లో నీటి ఎద్దడి ఏర్పడే అవకాశం లేకపోలేదు. ఈ నేపథ్యంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాతోపాటు మహబూబాబాద్‌, సూర్యాపేట జిల్లాలకు మిషన్‌ భగీరథ తాగునీరు అందించేందుకు ప్రభుత్వం ముందస్తు చేర్యలు చేపట్టింది. ఈ మేరకు అశ్వాపురం మండల పరిధి కుమ్మరిగూడెంలోని దుమ్ముగూడెం ఆనకట్ట ఎత్తు మరో మీటరు పెంచేలా పనులు నిర్వహిస్తోంది. దీంతో గోదావరి నీరు ఆనకట్ట వద్ద దిగువకు రాకుండా ఉంటుంది. ప్రస్తుతం పనులు ముమ్మరంగా సాగుతుండగా, ఆనకట్టపై ఇసుక బస్తాలతో ఒక లేయర్‌ పూర్తి చేశారు. రెండో లేయర్‌ పనులు చేపడుతున్నారు. ఇసుక బస్తాలు అడ్డ్డుకట్టగా వేయడంతో ఇటీవల అలుగు పోసిన ఆనకట్ట వద్ద నదిలో నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. వారం, పది రోజుల్లో పనులు పూర్తయ్యే అవకాశం ఉంది. దీంతో ఆనకట్ట వద్ద ఒక టీఎంసీ నీరు నిల్వ ఉండనుంది.

ముఖచిత్ర హాజరు నమోదు ట్రయల్‌ రన్‌..

కొత్తగూడెంఅర్బన్‌: సాంకేతికత అమలులో ముందుండే సింగరేణి సంస్థ తాజాగా ఉద్యోగుల హాజరు నమోదులోనూ అధునాతన సాంకేతికత అమలు దిశగా చర్యలు చేపట్టింది. పారదర్శకత పెంచడం కోసం ప్రయోగాత్మకంగా కొత్తగూడెం ఏరియాలో ఫేస్‌ రికగ్నిషన్‌ అటెండెన్స్‌ (ముఖచిత్ర నమోదు ఆధారిత హాజరు)ను సోమవారం ప్రవేశపెట్టింది. ఇప్పటికే సింగరేణిలో కొన్ని జీఎం కార్యాలయాల్లో బయోమెట్రిక్‌ హాజరు విధానం అమల్లో ఉన్నా ఏరియావ్యాప్తంగా గనులు, విభాగాలన్నింటిలోనూ అమలు చేయడం ఇదే ప్రథమం. ఈ విధానం ద్వారా ఉద్యోగుల్లో క్రమశిక్షణ పెరుగుతుందని, సమయపాలన పాటిస్తారని యాజమాన్యం భావిస్తోంది. సింగరేణిలో దాదాపు 40 వేల మంది కార్మికులు ఉండగా కొత్తగూడెం ఏరియాలో సుమారు 1,600 మంది పనిచేస్తున్నారు. కొత్తగూడెం ఏరియాలో పైలట్‌ ప్రాజెక్టుగా ట్రయల్‌ రన్‌ ప్రారంభించింది. మొదటిరోజు ఆటంకాలు లేకుండా హాజరు నమోదు కావడంతో ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు. అనంతరం ఇతర ఏరియాల్లోని గనులు, విభాగాల్లోనూ అమలు చేయనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement