● డిసెంబర్‌లోగా మిల్లర్లు సీఎంఆర్ అప్పగించాల్సిందే.. ● పెండింగ్ బియ్యం సేకరణపై అధికారుల దృష్టి
ఖమ్మం సహకారనగర్: జిల్లాలోని రైస్ మిల్లులకు కేటాయించిన ధాన్యాన్ని మర ఆడించి క్లస్టమ్ మిల్లింగ్ రైస్(సీఎంఆర్)గా అప్పగించాల్సి ఉన్నా కొందరు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. పలుమార్లు గడువులు పొడిగించినా తీరు మారకపోవడంతో ఇటీవల ప్రభుత్వం తనిఖీలు చేయించడంతో ధాన్యం నిల్వలు తక్కువ ఉండడమే కాక బియ్యాన్ని పక్కదారి పట్టించినట్లు తేలింది. ఈ నేపథ్యాన ప్రభుత్వం చివరి అవకాశంగా డిసెంబర్ వరకు గడువు ఇస్తూ నిర్ణయం తీసుకుంది.
93వేల మె.టన్నులకు పైగా బాకీ
ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల సేకరించిన ధాన్యంలో 3,56,778.560 మెట్రిక్ టన్నులను జిల్లాలోని రైస్ మిల్లులకు కేటాయించింది. ఇందులో 67శాతం అంటే 23,35,593.468 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని సీఎంఆర్‌గా తిరిగి అప్పగించాల్సి ఉంటుంది. ఇందుకోసం జనవరి 31వ తేదీ వరకు గడువు పెట్టగా, ఇప్పటివరకు 1,41,686.115మెట్రిక్ టన్నుల బియ్యమే అందాయి. మిగిలిన 93,899.454 మె.టన్నుల బియ్యాన్ని అప్పగించేందుకు డిసెంబర్ వరకు ప్రభుత్వం తుది గడువు ప్రకటించింది.
విజిలెన్స్ తనిఖీలతో గుట్టురట్టు
జిల్లాలో రెండు నెలల క్రితం విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందాలు తనిఖీ చేపట్టాయి. మొత్తం 14 రైస్ మిల్లుల్లో తనిఖీ చేయగా ధాన్యం నిల్వల్లో భారీగా తేడా ఉన్నట్లు బయటపడింది. దీంతో నిల్వ ఉన్న ధాన్యం విలువతో పాటు జరిమానా చెల్లించాలని ప్రభుత్వం ఆదేశించారు. ఈమేరకు 14 మిల్లుల్లో 21,146.313 మె.టన్నుల ధాన్యం విలువ, జరిమానా కలిపి రూ.64,63,35,632 కోట్లు చెల్లించాల్సి ఉండగా, రూ.49,48,00,976 మాత్రమే చెల్లించారు. మిగతా రూ.15,15,34,656ను మిల్లర్లు చెల్లించాల్సి ఉంది. ఈక్రమాన బకాయి పడిన మిల్లర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు.
నిల్వల్లో తేడాలు
అక్టోబర్‌లో జిల్లాలోని తొమ్మిది రైస్ మిల్లుల్లో తనిఖీ చేపట్టగా, మూడు మిల్లుల్లో 6,019.99 మె. టన్నుల ధాన్యం తక్కువగా ఉందని పౌరసరఫరాల శాఖ అధికారులు తేల్చారు. ఈ ధాన్యం విలువ రూ.18,71,21,465కు గాను మిల్లర్లు రూ.2,98,56,405 మాత్రమే చెల్లించారు. ఇంకా రూ.15,72,65,060 చెల్లించాల్సి ఉంది. ఆతర్వాత కమిషనర్ కార్యాలయం నుంచి వచ్చిన ప్రత్యేక బృందాలు అప్పటికే తనికీ చేసిన రెండు మిల్లుల్లో పునఃపరిశీలన (సూపర్ చెక్) చేపట్టారు. దీంతో ఒక మిల్లులో 339.682 మె. టన్నుల ధాన్యం తేడా రావడంతో వారు విధించిన రూ.1,18,49,875 జరిమానా కూడా పెండింగ్ ఉంది. ఈక్రమాన విధుల్లో నిర్లక్ష్యం వహించే అధికారులపై చర్యలు తీసుకుంటూనే సీఎంఆర్ సేకరణ, జరిమానా వసూళ్లపై ప్రత్యేక దృష్టి సారించారు.
జిల్లాలోని రైస్‌మిల్లర్లకు కేటాయించిన ధాన్యాన్ని మర ఆడించి సీఎంఆర్‌గా చెల్లించాలి. ప్రస్తుతం 93,899.454 మె.టన్నుల బియ్యం బకాయి ఉన్నారు. ఈ బియ్యాన్ని డిసెంబర్‌లోగా అప్పగించేలా సూచనలు చేస్తున్నాం.
– చందన్‌కుమార్, డీసీఎస్‌ఓ


