పెద్దమ్మతల్లి షాపుల వేలంలో పోటాపోటీ | - | Sakshi
Sakshi News home page

పెద్దమ్మతల్లి షాపుల వేలంలో పోటాపోటీ

Nov 3 2026 12:39 AM | Updated on Nov 3 2026 12:39 AM

పాల్వంచరూరల్‌: పాల్వంచ మండలంలోని పెద్దమ్మగుడి ఆలయం వద్ద వ్యాపార దుకాణాలకు నిర్వహించిన బహిరంగ వేలంపాటలో పోటీ నెలకొంది. తద్వారా ఆలయానికి గతేడాది కంటే అదనంగా రూ.2,11,200 ఆదాయం లభించింది. శ్రీకనకదుర్గ(పెద్దమ్మతల్లి) ఆలయంలో సోమవారం కొత్త కాంప్లెక్స్‌ పరిధిలోని 1, 2, 3, 5, 6, 7, 8, 10, 12 నంబర్ల షాపులకు, పాతకాంప్లెక్స్‌లోని 1వ నంబర్‌ దుకాణం, రెండు ఏసీ ఫంక్షన్‌ హాళ్లు, పూలవిక్రయాలు, ఫొటోలు తీసుకునేందుకు, స్క్రాప్‌ విక్రయాలకు సీల్డ్‌ టెండర్‌ కం బహిరంగ వేలంపాటలు నిర్వహించారు. దేవాదాయ, ధర్మాదాయశాఖ కొత్తగూడెం డివిజన్‌ పరిశీలకుడు ఆనంద్‌, ఈఓ విజయ్‌కుమార్‌ పర్యవేక్షించారు.

పోటీతో పెరిగిన ఆదాయం

5వ నంబర్‌ షాపునకు ముగ్గురు పోటీపడగా జగన్నాథపురానికి చెందిన పి.వీరభద్రం రూ.1.44 లక్షలు హెచ్చుపాట పాడి దక్కించుకున్నారు. గతేడాది ఇదేషాపునకు రూ.98,400 ఉండగా, ఈసారి రూ. 45,600 అదనంగా ఆదాయం పెరిగింది. 6వ దుకా ణాన్ని జగన్నాథపురానికి సీహెచ్‌ భవాని రూ. 1.32 లక్షలకు హెచ్చుపాటపాడి దక్కించుకున్నారు. గతేడాది ఇదేషాపునకు రూ.86,400 ఆదాయం రాగా, ఈసారి రూ.45,600 పెరిగింది. 7వ షాపును కూడా జగన్నాథపురానికే చెందిన బి.నాగలక్ష్మి రూ. 1,69,200 హెచ్చుపాడి దక్కించుకున్నారు. గతేడాది ఇదేషాపునకు రూ.1,03,200 రాగా, ఈసారి రూ.66వేల ఆదాయం పెరిగింది. 8వ షాపును బి.శైలజ రూ.3.72లక్షలకు దక్కించుకుంది. ఇదే షాపునకు గతేడాది రూ.3.18లక్షలు వచ్చింది. ఈసారి రూ.54వేల ఆదాయం పెరిగింది. దుకాణాలు దక్కించుకున్నవారంతా జగన్నాథపురం గ్రామానికే చెందిన వారే కావడం గమనార్హం. కాగా, మిగిలిన షాపుల వేలంపాటకు ఎవరూ ముందుకు రానికారణంగా వాయిదా వేసినట్లు ఈఓ తెలిపారు.

దుకాణాలకు గతేడాది కంటే

పెరిగిన ఆదాయం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement