దాణా ధరలు ఇలా.. (క్వింటాకు రూ.ల్లో)
పాడి రైతులకు గుదిబండలా మారిన పశుపోషణ ఓ దాణా ధరల మోత, ఎల్‌నినోతో పశుగ్రాసం కొరత
గిట్టుబాటు కావడం లేదు..
సమగ్ర ప్రణాళిక అవసరం
పశుపోషణ భారమే...
ఖమ్మం వ్యవసాయం: ఎల్‌నినో ప్రభావంతో ఏర్పడిన వర్షాభావ పరిస్థితులు జిల్లా పాడి రైతులను కుంగదీస్తున్నాయి. పశుగ్రాసం కొరతకు తోడు దాణా ధరల పెరుగుదలతో పాడి రైతులకు పశుపోషణ భారంగా మారింది. ఖమ్మం జిల్లాలో పశుసంవర్ధక శాఖ లెక్కల ప్రకారం 3.25 లక్షల పాడి పశువులు ఉన్నాయి. ఇందులో గేదెలు 2.51 లక్షలు, ఆవులు 74 వేలు ఉండగా.. రైతులు వీటి నుంచి సేకరించే పాలను విజయ డెయిరీతో పాటు ప్రైవేట్ డెయిరీలకు విక్రయిస్తున్నారు.
వరిగడ్డి ధర రెట్టింపు
పశువులకు ప్రధాన ఆహారమైన పచ్చి గడ్డి, వరిగడ్డి కొరత తీవ్రమైంది. వర్షాలు లేక ఉష్ణోగ్రతలు పెరగడంతో భూములు బీళ్లుగా వదిలేశారు. వర్షాభావం వల్ల వరి సాగు విస్తీర్ణం తగ్గి వరిగడ్డి ఉత్పత్తి పడిపోయింది. సాధారణంగా వరి కోతల సీజన్‌లో ట్రాక్టర్ ట్రక్కు(100 మోపులు) ధర రూ.8వేల నుంచి రూ.10 వేల వరకు ఉండేది. ఇప్పుడు ఏకంగా రూ.15 వేలకు చేరింది. గత ఏడాది రూ.80 నుంచి రూ.100 పలికిన మోపు ధర ఈ ఏడాది రూ.150కి చేరడం గమనార్హం.
జీఎస్టీ మినహాయింపు ఉన్నా..
పాల దిగుబడి కోసం తవుడు, మినప, పెసర చున్నీలు, వేరుశనగ పిండి, పత్తి గింజల పిండి, ఖనిజ మిశ్రమాన్ని పశువులకు దాణాగా వాడుతారు. వరి, పప్పు ధాన్యాలు, వేరుశనగ సాగు తగ్గడంతో ఉప ఉత్పత్తుల ధరలు అమాంతం పెరిగాయి. కేంద్రం ఇటీవల జీఎస్టీ సంస్కరణల్లో భాగంగా పశుగ్రాసం, తవుడు, చున్నీలు వంటి పలు దాణా పదార్థాలపై ఐదు శాతం ఉన్న జీఎస్టీని పూర్తిగా తొలగించింది. అయినా ముడి సరుకు కొరత, డిమాండ్ కారణంగా రైతులకు ప్రయోజనం దక్కడం లేదు.
పెరగని పాల ధర
ఓ వైపు పశువుల ధరలు రూ.లక్షల్లో పలుకుతుండగా.. మరోవైపు గ్రాసం, దాణా ధరలు అందనంత దూరాన ఉన్నాయి. ఇదే సమయాన పాల ధర పెరగకపోవడంతో పశుపోషణ భారంగా మారిందని రైతులు వాపోతున్నారు. ప్రస్తుతం లీటర్ పాల ధర ప్రాంతాల ఆధారంగా రూ.80 నుంచి 100 వరకు ఉంది.
దాణా గతంలో ప్రస్తుతం
తవుడు 1,500 2,400
మినప, పెసర చున్నీలు 2,800 3,500
పత్తి గింజల పిండి 2,800 3,700
ఖనిజ మిశ్రమం 6,000 7,500
మరోపక్క గిట్టుబాటు కాని
పాల ధరలతో ఆవేదన
మాకు ఎనిమిది గేదెలు ఉన్నాయి. పాల ఉత్పత్తే జీవనాధారం. ధరలు పెరిగినందున ప్రభుత్వం సబ్సిడీపై దాణా, మినరల్ మిక్చర్ ఇస్తే ఉపయోగకరంగా ఉంటుంది.
– నాగేశ్వరరావు, వెంకటగిరి
గ్రాసం కొరతను అధిగమించేలా సైలేజ్, అజోల్లా, హైడ్రోపోనిక్ పద్ధతులపై దృష్టి సారించాలి. చెరువుల శిఖం భూముల్లో పశుగ్రాసం పెంచే అంశాన్ని పరిశీలిస్తున్నాం. – డాక్టర్ బి.పురంధర్,
ఖమ్మం జిల్లా పశు వైద్యాధికారి
నాలుగు గేదెలు ఉన్నాయి. పంటలతో పాటు పాడి లాభదాయకంగా ఉండేది. కానీ ఇప్పుడు వరిగడ్డి, తవుడు, మినప చున్నీ ధరలు బాగా పెరిగి పోషణ భారంగా మారింది.
– జంగా నవీన్‌రెడ్డి, పండితాపురం


