కలెక్టర్ ప్రత్యేక దృష్టి
కలెక్టర్ చొరవతో ఖమ్మం జీజీహెచ్‌కు నిధులు
నాణ్యమైన సేవల కోసం
చకచకా పనులు
నాలుగు జిల్లాల ప్రజలకు అందనున్న మెరుగైన వైద్యం
ఖమ్మం వైద్యవిభాగం: ఖమ్మం జిల్లా జనరల్ ఆస్పత్రికి వచ్చే పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే కాక మౌలిక వసతులు కల్పించడంపై కలెక్టర్ దివాకర టీ.ఎస్. ప్రత్యేక దృష్టి సారించారు. ఇందులో భాంగా కేటాయించిన నిధులో చేపట్టిన పనులు చురుగ్గా కొనసాగుతున్నాయి. ఈ పనులు పూర్తయితే వైద్యసేవలు మరింత మెరుగుపడనున్నాయి.
నాలుగు జిల్లాల నుంచి జనం
ఖమ్మం జిల్లా ఆస్పత్రికి ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలతో పాటు మహబూబాబాద్, సూర్యాపేట ప్రజలు కూడా వైద్యం కోసం వస్తుంటారు. మెడికల్ కాలేజీ ఏర్పాటయ్యాక జనం తాకిడి మరింత పెరిగింది. నిత్యం 1,500 – 2,000 వరకు వైద్యసేవల కోసం వస్తుండగా, ఆ స్థాయిలో సౌకర్యాలు లేకపోవడంతో ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఓపీ చిట్టీల కోసమే కాక మందుల కోసం వేచి చూడాల్సి వస్తోంది.
కొనసాగుతున్న అభివృద్ధి పనులు
పెద్దాస్పత్రికి ఎంఆర్‌ఐ యంత్రం మంజూరు కాగా, ట్రాన్స్‌ఫార్మర్, విద్యుత్ లైన్ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. లైన్ సిద్ధమైన ఎంఆర్‌ఐ స్కానింగ్ యంత్రాన్ని తెప్పిస్తారు. అలాగే ఓపీ విభాగం ఇరుగ్గా ఉండడంతో జనం పడిగాపులు కాయాల్సి వస్తోంది. ఈ నేపథ్యాన ఆస్పత్రి వెలుపల అదనంగా షెడ్లు నిర్మిస్తున్నారు. ఈ నిర్మానాలు పూర్తయితే ఓపీ చిట్టీల జారీలో వేగం పెరగనుంది. అంతేకాక ఫార్మసీ విభాగం విస్తరణకు విశాలమైన గది నిర్మిస్తున్నారు. అది రెండు నెలల్లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. అలాగే బయో మెడికల్ వేస్ట్ వేసేందుకు ప్రత్యేక గదులు నిర్మించారు. ఇంకా మెడికల్ కళాశాలతో ఆస్పత్రిని అనుసంధానించే ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి. ఇవేకాక ఆస్పత్రిలో టాయిలెట్ల ఆధునికీకరణ పనులు కూడా యుద్ధప్రాతిపదికన నిర్వహిస్తున్నారు.
కలెక్టర్ దివాకర, అడిషనల్ కలెక్టర్ శ్రీజ ప్రత్యేక చొరవతో ఆస్పత్రిలో పలు అభివృద్ధి పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు పలు రకాల పనులు నిర్వహిస్తున్నారు. ఇవన్నీ పూర్తయితే వైద్యసేవలు మరింత మెరుగుపడతాయి. అంతేకాక అధునాతన పరికరాల ఏర్పాటుకు టెండర్ ప్రక్రియ కొనసాగుతోంది.
– డాక్టర్ నరేందర్,
ఆస్పత్రి మెడికల్ సూపరింటెండెంట్
ఆస్పత్రికి వచ్చే జనం పడుతున్న ఇబ్బందులు కలెక్టర్ దివాకర దృష్టికి వెళ్లటంతో ప్రత్యేక దృష్టి సారించారు. వసతుల కల్పన, అభివృద్ధిపనుల కోసం వివిధ శాఖల నుంచి నిధులు కేటాయించారు. అంతేకాక తరచూ ఆస్పత్రి అధికారులతో సమీక్షలు నిర్వహిస్తూ సేవలు మెరుగు పడేలా చర్యలు తీసుకుంటున్నారు. వైద్యులు సమయపాలన పాటించేలా చర్యలు చేపట్టారు. ఈక్రమాన పరిస్థితులు గతంలో కంటే మెరుగయ్యాయి.


