కొత్తగా 47 వేల దరఖాస్తులు
● భర్త మరణిస్తే ఇక భార్యకు తక్షణ పింఛన్ ● చేయూత పెన్షన్ పరిధి విస్తరణకు ప్రభుత్వం చర్యలు
చుంచుపల్లి: ఆపదలో ఉన్న కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చేయూత పింఛన్ల విధానంలో కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది. ఇప్పటికే పింఛన్ పొందుతున్న కుటుంబంలో పెద్దదిక్కుగా ఉన్న వ్యక్తి మరణిస్తే ఆ కుటుంబానికి అందుతున్న ఆర్థిక సాయం నిలిచిపోకుండా చర్యలు చేపట్టింది. పింఛన్ పొందుతున్న వ్యక్తి మృతి చెందితే అర్హత మేరకు అతని భార్యకు తక్షణమే పింఛన్ మంజూరు చేసేలా ఇన్‌స్టంట్ పెన్షన్ విధానాన్ని అమల్లోకి తేవాలని నిర్ణయించింది. ఇప్పటివరకు వృద్ధాప్య పింఛనుదారుల భార్యలకు మాత్రమే అందుబాటులో ఉన్న ఈ వెసులుబాటును తాజాగా మరికొన్ని కేటగిరీలకు వర్తింపజేసింది. దివ్యాంగులు, గీత కార్మికులు, చేనేత కార్మికులు, డయాలసిస్, హెచ్‌ఐవీ, పైలేరియా బాధితుల కుటుంబాలకూ ఈ సదుపాయాన్ని విస్తరింపజేయనుంది. ఈ మేరకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఇటీవల మార్గదర్శకాలు జారీ చేసింది. మరోవైపు ఇటీవల కొత్తగా దరఖాస్తు చేసుకున్నవారు పింఛన్ మంజూరు కోసం ఎదురుచూస్తున్నారు.
పింఛన్‌దారుడు మృతి చెందితే
కుటుంబానికి అండగా..
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రస్తుతం చేయూత కింద 3,19,442 మంది వివిధ రకాల సామాజిక భద్రతా పింఛన్లు పొందుతున్నారు. ఇందులో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 1,24,687 మంది ఉండగా, ఖమ్మం జిల్లాలో 1,94,755 మంది ఉన్నారు. పింఛన్ పొందుతున్న వ్యక్తి మరణిస్తే వృద్ధాప్యంలో ఉన్న భార్య ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉంది. పింఛన్ కోసం మళ్లీ దరఖాస్తు చేసుకోవడం, అర్హతల పరిశీలన, మంజూరు ప్రక్రియ పూర్తయ్యే వరకు ఎదురుచూడాల్సి వచ్చేది. ఈ సమస్యను గుర్తించిన ప్రభుత్వం ఇన్‌స్టంట్ పెన్షన్ విధానాన్ని తేబోతుంది. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం వల్ల అభాగ్యులకు చేయూత పథకం మరింత ఆర్థిక భరోసాగా నిలవనుంది.
రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం అర్హులకు చేయూత పింఛన్ అందేలా చర్యలు తీసుకుంటున్నాం. కొత్తగా వచ్చిన దరఖాస్తులపై క్షేత్రస్థాయి విచారణ ఇప్పటికే పూర్తయింది. జాబితా సిద్ధం చేస్తున్నాం. ప్రభుత్వం నుంచి తదుపరి ఆదేశాలు అందిన వెంటనే పింఛన్ల మంజూరు ప్రక్రియ చేపడతాం. ఇన్‌స్టంట్ పెన్షన్ విధానం విస్తరణతో పింఛన్‌దారులు మరణించిన కుటుంబాలకు ఆర్థిక ఇబ్బందులు కలగకుండా వెసులుబాటు కలుగుతుంది.
– ఎం.విద్యాచందన, భద్రాద్రి డీఆర్‌డీఓ
ఇటీవల ప్రభుత్వం కొత్తగా పింఛన్ కోసం దరఖాస్తులు ఆహ్వానించింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 19,346 మంది, ఖమ్మం జిల్లాలో 27,766 మంది కొత్త పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఈ సంఖ్య 47,112కు చేరింది. వీరిలో అర్హులను గుర్తించేందుకు అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ పూర్తి చేశారు. ప్రభుత్వం నుంచి ఆదేశాలు వెలువడితే కొత్త లబ్ధిదారులకు పింఛన్లు అందే అవకాశం ఉంది.


