నయా మోసం ! | - | Sakshi
Sakshi News home page

నయా మోసం !

Nov 3 2026 12:39 AM | Updated on Nov 3 2026 12:39 AM

పెట్టుబడి పేరుతో ‘క్యూవీఎస్‌ఈ’ ఏపీకే ఫైళ్లు ఏమరుపాటుగా ఉంటే సొమ్ము పోయినట్టే.. అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్న సైబర్‌ క్రైమ్‌ విభాగం

ఖమ్మంక్రైం: బహుమతులు, లాటరీల పేరుతో కాక ఉద్యోగం ఇప్పిస్తామంటూ నమ్మించి ఖాతాల నుంచి నగదు స్వాహా చేస్తున్న ఘటనలు ఇప్పటికే పలుచోట్ల వెలుగుచూశాయి. తాజాగా క్యూవీఎస్‌ఈ(క్వాంటమ్‌ వెస్ట్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌) యాప్‌ పేరిట మోసాలు మొదలైనట్లు ప్రచారం జరుగుతోంది. పెట్టుబడి పేరిట ఈ యాప్‌ ద్వారా రూ.వేలు, రూ.లక్షల్లో కొల్లగొడుతున్నారని తెలుస్తోంది. వివిధ ప్రాంతాల ప్రజలు ఈ పేరుతో వచ్చిన ప్రకటనలు నమ్మి మోసపోగా.. జిల్లాలో అలాంటి కేసులేమీ ఇప్పటివరకై తే నమోదు కాలేదు. అయినప్పటికీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర, రాష్ట్ర సైబర్‌ క్రైం విభాగాల ఆదేశాలతో జిల్లా పోలీసులు విస్తృత ప్రచారం చేస్తున్నారు.

లాభం.. చేర్పిస్తే ఆదాయం

విదేశాలకు సంబంధించిన ఈ యాప్‌ ద్వారా సైబర్‌ నేరగాళ్లు ఫోన్‌ చేసి పెట్టుబడి పెడితే అత్యధిక లాభాలు వస్తాయని నమ్మించారు. ఎవరైనా సానుకూలగా స్పందిచగానే ఏపీకే ఫైల్‌ పంపించి డౌన్‌లోడ్‌ చేసుకుని ఇన్‌స్టాల్‌ చేసుకోవాలని సూచిస్తారు. తద్వారా మన కరెన్సీ ప్రకారం రూ.54వేలు పెట్టుబడితే ఒక శాతం లాభం వస్తుందని ఆశ చూపిస్తారు. దీనికి తోడు ఇతరులను యాప్‌లో చేర్పిస్తే మొదటి రిఫరల్‌కు రూ.5వేలు, రెండో స్థాయి రిఫరల్‌కు రూ.2,500 వస్తాయని నమ్మిస్తారు. అంతేకాక పెట్టుబడి కూడా క్రిప్టో కరెన్సీ ఎక్స్ఛేంజ్‌ ప్లాట్‌ఫాం బినాన్స్‌ ద్వారా పెట్టాలని సూచిస్తున్నట్లు తెలిసింది. కాగా, క్యూవీఎస్‌ఈ యాప్‌ ద్వారా పెద్ద ఎత్తున ఆన్‌లైన్‌ పెట్టుబడి మోసాలు జరుగుతున్నట్లు కేంద్ర, రాష్ట్ర సైబర్‌ క్రైమ్‌ విభాగాలు గుర్తించారు. ఈమేరకు జిల్లాలో ఎవరూ మోసపోకుండా సైబర్‌ క్రైమ్‌ పోలీసులు విస్తృత అవగాహన కల్పిస్తున్నారు.

ఈ జాగ్రత్తలు పాటిస్తే మేలు

● తక్కువ సమయంలో అధిక లాభాలు వస్తాయనే అనధికారిక ప్రకటనలను నమ్మవద్దు.

● గుర్తుతెలియని వ్యక్తులు పంపే ఏపీకే పైళ్లు, అనుమానాస్పద యాప్‌లను డౌన్‌లోడ్‌ చేసుకోవద్దు.

● క్రిప్టో కరెన్సీ రూపంలో బదిలీ సూచిస్తే అప్రమత్తంగా ఉండాలి.

● ఓటీపీలు, బ్యాంక్‌ ఖాతా వివరాలు, పాస్‌వర్డ్‌లను ఇతరులతో పంచుకోవద్దు. ఇతరులను రిఫర్‌ చేస్తే అదనపు ఆదాయం వస్తుందని చెప్పే పథకాలపై జాగ్రత్తగా ఉండాలి.

● మోసానికి గురైతే వెంటనే జాతీయ సైబర్‌క్రైమ్‌ హెల్ప్‌ లైన్‌ 1930 నంబర్‌కు ఫోన్‌ చేయాలి.

● లేదా WWW.cybercrime.gov.in వెబ్‌సైట్‌ ద్వారా త్వరగా ఫిర్యాదు చేస్తే నష్టాన్ని తగ్గించుకునే అవకాశం ఉంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement