రఘునాథపాలెం: ఎల్‌నినో ప్రభావంతో భూగర్భ జలాలు పడిపోవడమే కాక అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నందున రైతులు పంటల సాగులో తగిన జాగ్రత్తలు పాటించాలని జిల్లా ఉద్యానవన శాఖాధికారి ఎం.వీ.మధుసూదన్, జిల్లా వ్యవసాయశాఖ అధికారి పుల్లయ్య సూచించారు. రఘునాథపాలెం మండలం మంచుకొండలో శనివారం నిర్వహించిన అవగాహన సదస్సులో వారు మాట్లాడారు. అందుబాటులో ఉన్న నీటిని పొదుపుగా వినియోగిస్తూ బిందు సేద్యం ద్వారా పంటలను కాపాడుకోవాలని, రబీలో తక్కువ నీటితో సాగయ్యే కూరగాయల పంటలకు ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. వరికి బదులు ఆరుతడి పంటలు, పప్పుదినుసులు సాగు చేయాలని కోరారు. వర్షపు నీటిని ఒడిసిపట్టేలా వ్యవసాయ క్షేత్రాల్లో నీటి కుంటలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. అనంతరం మల్యాల ఉద్యాన పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ప్రశాంత్ మాట్లాడగా సొసైటీల చైర్మన్లు మందనపు సుధాకర్, తాత రఘురామ్, సర్పంచ్ తేజావత్ శంకర్‌నాయక్, ఉద్యాన అధికారి జి.నగేష్, ఏఓ ఉమామహేశ్వర్‌రెడ్డి, రైతు గోగినేని రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.


