ఖమ్మంఅర్బన్: ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేలా అర్హులైన పట్టభద్రులంతా ఓటర్లుగా నమోదు చేసుకోవాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. వచ్చేనెల 6వ తేదీతో గడువు ముగియనున్నందున దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. ఖమ్మం చర్చి కాంపౌండ్, గాంధీచౌక్, కార్పొరేషన్ కార్యాలయం, రోటరీనగర్ ప్రాంతాల్లో పార్టీ ఆధ్వార్యన ఏర్పాటుచేసిన శిబిరాలను శుక్రవారం మంత్రి పరిశీలించి మాట్లాడారు. గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసిన వారే కాక కొత్త ఓటర్లు కూడా దరఖాస్తు చేసుకోవాలని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యంలో విలువైన ఓటు హక్కు వినియోగించుకునేలా పట్టభద్రులు ముందుకు రావాలని మంత్రి పిలుపునిచ్చారు. సుడా, గ్రంథాలయ సంస్థల చైర్మన్లు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, ఎం.డీ.ఖాదర్ బాబా, కాంగ్రెస్ నగర అధ్యక్షుడు నాగండ్ల దీపక్ చౌదరితో పాటు ఎర్రం బాలగంగాధర్ తిలక్, పైడిపల్లి సత్యనారాయణ, నారాయణరావు తదితరులు పాల్గొన్నారు.
మంత్రి తుమ్మల నాగేశ్వరరావు


