ఖమ్మంమయూరిసెంటర్: సీపీఎం నేత సామినేని రామారావు హత్య కేసులో పోలీసులు దోషులను పట్టుకుంటే సీపీఎం నాయకులు ఓర్వలేక కాంగ్రెస్ పార్టీపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని పార్టీ జిల్లా అధ్యక్షుడు నూతి సత్యనారాయణ గౌడ్, సుడా చైర్మన్ పువ్వాళ్ల దుర్గాప్రసాద్ పేర్కొన్నారు. ఖమ్మంలోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం వారు మాట్లాడుతూ పోలీసులు నిష్పక్షపాతంగా విచారణ చేపట్టి దోషులను అరెస్ట్ చేశారని తెలిపారు. అయితే, హత్య వెనుక అసలు నిజాలు నిగ్గు తేల్చేందుకు మరింత లోతుగా దర్యాప్తు చేసి దోషులకు చట్టపరంగా కఠిన శిక్ష పడేలా చూడాలని కోరారు. కాగా, సీపీఎం నేతలు చేస్తున్న ఆరోపణలన్నీ అవాస్తవమని, ఆ పార్టీ నేతలవి మొదటి నుంచి హత్యా రాజకీయాలేనని పేర్కొన్నారు. మధిర నియోజకవర్గంలో డిప్యూటీ సీఎం భట్టి హయాంలో శాంతిభద్రతలు మెరుగ్గా ఉన్నాయని, గతంలో సీపీఎం ప్రాతినిధ్యం వహించినప్పుడు ప్రజలు భయంగా బతికారరు. నారాయణపురంలో సీపీఎం కార్యకర్తలు కాంగ్రెస్ లో చేరడంతో అసత్య ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు. మాజీ ఎమ్మెల్సీలు బాలసాని లక్ష్మీనారాయణ, పోట్ల నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే కొండబాల కోటేశ్వరరావు, నాయకులు రాయల నాగేశ్వరరావు, గజ్జెల్లి వెంకన్న, పుచ్చకాయల వీరభద్రం, దొబ్బల సౌజన్య, బొడ్డు బొందయ్య, మొక్క శేఖర్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
డీసీసీ అధ్యక్షుడు నూతి, సుడా చైర్మన్ పువ్వాళ్ల


