వరిపై ‘అర్నబ్‌’ దాడి | - | Sakshi
Sakshi News home page

వరిపై ‘అర్నబ్‌’ దాడి

Oct 30 2026 12:21 AM | Updated on Oct 30 2026 12:21 AM

● జిల్లాలో 1,138 ఎకరాల్లో నేలవాలిన పంట ● ప్రాథమికంగా అంచనా వేసిన వ్యవసాయ శాఖ

ఆశలు వదిలేసుకోలేక....

● జిల్లాలో 1,138 ఎకరాల్లో నేలవాలిన పంట ● ప్రాథమికంగా అంచనా వేసిన వ్యవసాయ శాఖ

ఖమ్మం వ్యవసాయం: అర్నబ్‌ తుపాన్‌ చేతికందే పంటలను దెబ్బతీసింది. జిలాల్లో మంగళవారం రాత్రి నుంచి బుధవారం రాత్రి వరకు ఓ మోస్తరు వర్షమే కురిసినా, తీవ్రగామైన ఈదురుగాలులతో పంటలు నేలపాలయ్యాయి. ప్రస్తుతం పత్తితీతలు జోరుగా సాగుతుండగా, వరి కోతలు కూడా ప్రారంభమయ్యాయి. ఈ సీజన్‌లో జిల్లా అంతటా కలిపి వరి 2,41,109 ఎకరాల్లో, పత్తి 2,35,637 ఎకరాల్లో సాగయ్యాయి. తుపాన్‌ కారణంగా బలమైన గాలులు వీయడంతో కంకి దశలో ఉన్న వరి నేలవాలిందని వ్యవసాయ శాఖ ప్రాథమికంగా గుర్తించింది.

53 గ్రామాల్లో నష్ట తీవ్రత

తుపాన్‌ కారణంగా జిల్లాలోని 53గ్రామాల్లో 558 మంది రైతులకు చెందిన 1,138 ఎకరాల్లో వరి పంటకు నష్టం వాటిల్లినట్లు వ్యవసాయ శాఖ ప్రాథమిక నివేదికలో వెల్లడించింది. అదికంగా కూసుమంచి వ్యవసాయ డివిజన్‌లో 725 ఎకరాల్లో నష్టం జరగగా, అందులో కూసుమంచి మండలంలో 310 ఎకరాలు, నేలకొండపల్లిలో 285 ఎకరాలు ఉన్నాయి. ఇక మధిర డివిజన్‌లోని ఎర్రుపాలెం మండలంలో 208 ఎకరాలు, సత్తుపల్లి డివిజన్‌ లోని కల్లూరు మండలంలో 150 ఎకరాలు, వేంసూరు మండలంలో 55 ఎకరాల్లో పంట దెబ్బతిన్నట్లు గుర్తించారు. నేలవాలిన వరి పైరును హార్వెస్టర్‌లతో కోయడానికి ఇబ్బంది కానుండగా, కూలీలతో కోయిస్తే రైతులపై అదనపు భారం పడనుంది.

33 శాతం నష్టం వాటిల్లితేనే..

ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు నిబంధనల ప్రకారం 33 శాతం పంట నష్టం జరిగితేనే వ్యవసాయ, రెవెన్యూ శాఖల ఆధ్వర్యాన సర్వే చేయించి ప్రభుత్వం పరిహారాన్ని ప్రకటిస్తుంది. ప్రస్తుతం జిల్లాలో అర్నబ్‌ తుపాన్‌ కారణంగా జరిగిన పంట నష్టాన్ని ప్రాథమికంగానే గుర్తించారు. ప్రభుత్వం ఆదేశిస్తే సర్వే ద్వారా నష్టం శాతాన్ని గుర్తించి పరిహారానికి సిఫారసు చేయాల్సి ఉంటుంది.

వర్షపాతం అంతంతే..

అర్నబ్‌ తుపాన్‌తో భారీ వర్షాలు కురుస్తాయని అంతా భావిస్తే ఆ అంచనాలు తలకిందులయ్యాయి. ఈదురుగాలులే తప్ప వర్షం ఆశించిన స్థాయిలో కురవలేదు. జిల్లాలో బుధవారం ఉదయం 8–30నుంచి గురువారం ఉదయం 8–30 గంటల వరకు 24 గంటల్లో జిల్లా వ్యాప్తంగా సగటున 15.4 మి.మీ. వర్షపాతం నమోదైంది. అత్యధికంగా సత్తుపల్లిలో 26.2 మి.మీ., వేంసూరులో 24.8, ఎర్రుపాలెంలో 22.6, బోనకల్‌ లో 21.8 మి.మీ. నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ఇవికాక మధిర, కామేపల్లి, ఖమ్మం రూరల్‌, కూసుమంచి, ఖమ్మం అర్బన్‌, ఏన్కూరు, తల్లాడ, ముదిగొండ, సింగరేణి, నేలకొండపల్లి, తిరుమలాయపాలెం, రఘునాథపాలెం, కొణిజర్ల, కల్లూరు, వైరా, చింతకాని, పెనుబల్లి కూడా వర్షపాతం నమోదైంది.

నేలకొండపల్లి: రెండు రోజుల తుపాన్‌ ప్రభావంతో బలమైన ఈదురుగాలులు వీయగా చేతికొచ్చే దశలో ఉన్న వరి పంట నేలవాలింది. ఇదిలాగే నేలకు వదిలేస్తే వరి కంకి మొక్కగా మారే అవకాశముంది. దీంతో అదనపు భారమైనా రైతులు కూలీలను నియమించి నిలబెట్టిస్తున్నారు. నేలకొండపల్లి మండలంలో కూలీకి రూ.350 చొప్పున చెల్లించేలా పలువురు రైతులు పనిచేయిస్తుండగా.. ఇంకొందరు ఇప్పటికే పెట్టుబడి పెరిగిందని, మరింత భారం భరించలేమంటూ వెనుకడుగు వేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement