వెలుగుమట్లలో నిర్మాణాల పరిశీలన
● అనుమతులు, సర్టిఫికెట్ల జారీలో అలసత్వం సరికాదు ● డిసెంబర్‌లో సీఎం చేతుల మీదుగా అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు ● రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
ఖమ్మం మయూరిసెంటర్: ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా, అక్రమంగా చేపట్టే నిర్మాణాలను ముందుగానే గుర్తించి నిలిపివేయాలని రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. కేఎంసీ కార్యాలయంలో గురువారం ఆయన నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులు నిత్యం క్షేత్ర స్థాయిలో పర్యవేక్షిస్తూ అక్రమ నిర్మాణాలపై ఫిర్యాదులు వచ్చే వరకు వేచి ఉండకుండా ముందుగానే నిర్మాణాలను అడ్డుకోవాలని తెలిపారు. అలాగే, నిర్మాణాల అనుమతులు, అవసరమైన సర్టిఫికెట్ల జారీలో జాప్యం జరుగుతుండడంపై ఆరా తీశారు. టౌన్ ప్లానింగ్, సుడాపై ఫిర్యాదులు అధికంగా వస్తున్నాయని చెప్పారు. ఎల్‌ఆర్‌ఎస్ అనుమతుల్లో జాప్యం లేకుండా ఇరిగేషన్, రెవెన్యూ శాఖలతో సమన్వయం చేసుకోవాలని సూచించారు.
డిసెంబర్‌లో ఖమ్మంకు సీఎం..
నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనుల్లో వేగం పెంచి నవంబర్ నెలాఖరు వరకు పూర్తి చేయాలని మంత్రి తుమ్మల సూచించారు. డిసెంబర్‌లో సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా పనుల ప్రారంభోత్సవం జరగనున్నందున, వెలుగుమట్లలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులపైనా దృష్టి పెట్టాలని తెలిపారు. అలాగే, నగరంలో ఆస్తిపన్నుతో పాటు నీటి సరఫరా, ఇతర పన్నులను వంద శాతం పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. పన్నుల వసూళ్లలో వెనుక బడిన ప్రాంతాలను గుర్తించి ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని, పారిశుద్ధ్య నిర్వహణ, ప్రభుత్వ భూముల పరిరక్షణ, ఆర్‌అండ్‌బీ అతిథి గృహం, బడ్జెట్ హోటల్, ఇంటిగ్రేటెడ్ డివిజన్ కార్యాలయ నిర్మాణాలు, టేకులపల్లి బ్రిడ్జి వద్ద రక్షణ ఏర్పాట్లు, ఖమ్మం ఖిల్లా రోప్‌వే పనులపై సూచనలు చేశారు. ఈ సమావేశంలో సుడా చైర్మన్ పువ్వాళ్ల దుర్గాప్రసాద్, కేఎంసీ కమిషనర్ అభిషేక్ అగస్త్య, వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు.
ఖమ్మం అర్బన్: లుగుమట్ల కాలనీలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలతో పాటే సమాంతరంగా మౌలిక వసతులు కల్పిస్తూ నవంబర్ నెలాఖరులోగా పూర్తి చేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. కలెక్టర్ దివాకరతో కలిసి కాలనీలో పనులను ఆయన పరిశీలించారు. పనుల్లో జాప్యం జరగకుండా ప్రతిరోజూ పర్యవేక్షించాలని తెలిపారు. సుడా చైర్మన్ పువ్వాళ్ల దుర్గాప్రసాద్, హౌసింగ్ పీడీ భూక్యా శ్రీనివాస్ పాల్గొన్నారు.


