గెలల ట్రాన్స్‌పోర్ట్ చార్జీల శ్లాబులు
అదే సమయంలో ఎఫ్ కోడ్, ట్రాన్స్‌పోర్ట్ కోడ్‌లలో పారదర్శకత కరువు
ఆయిల్‌ఫెడ్‌లో లొసుగుల ఆధారంగా సాగుతున్న మోసాల దందా
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: పామాయిల్ సాగులో రాష్ట్రానికి భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలు ఆదర్శంగా ఉన్నాయి. ఈ ఆదర్శం మాటున అక్రమాల ఆలాపన కూడా వినిపిస్తోంది. పామాయిల్ సాగు రంగంలో తమకు సాటి లేదని చెప్పుకునే కొందరు పెద్దల సిండికేట్ వ్యవహారాలే ఇందుకు కారణమనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఎఫ్ కోడ్ ద్వారా..
పామాయిల్ మొక్కలను విదేశాల నుంచి దిగుమతి చేసుకుని ఆసక్తి ఉన్న రైతులకు సబ్సిడీపై అందిస్తున్నారు. దీంతో రైతులు తెలంగాణ ఆయిల్‌పామ్ ఫెడరేషన్‌కు దరఖాస్తు లేదా రిజిస్ట్రర్ చేసుకుంటే ఎకరానికి 57 మొక్కల చొప్పున ఇస్తారు. మొక్కలు నాటాక మూడేళ్ల తర్వాత దిగుబడి ప్రారంభమవుతుంది. మొక్కలను అమ్మేందుకు రైతులకు ఆయిల్ ఫెడ్ కోడ్‌ను కేటాయిస్తుంది. దీన్నే ఫార్మర్‌కోడ్ (ఎఫ్) కోడ్ అంటారు. ఈ కోడ్‌తోనే రైతు ఇచ్చిన ఫ్రెష్ ఫ్రూట్ బంచ్ (ఎఫ్‌ఎఫ్‌బీ)కు అప్పుడున్న ఆయిల్ ఎక్ట్రాక్షన్ రేషియో (ఓఈఆర్) ఆధారంగా అతని బ్యాంకు ఖాతాలో నగదు జమ అవుతుంది. పామాయిల్ గెలలను ఫ్యాక్టరీ వరకు తరలించినందుకు రైతులకు రవాణా చార్జీలను ఐదు శ్లాబులుగా చెల్లిస్తారు. ఇందుకోసం ఎఫ్‌కోడ్‌కు అనుసంధానంగా ప్రతీ రైతుకు ట్రాన్స్‌పోర్ట్ కోడ్ కూడా ఉంటుంది. ఎఫ్‌కోడ్‌కు అనుబంధంగా ఉన్న రైతు బ్యాంకు ఖాతాలో అమ్మిన గెలలకు సంబంధించిన నగదు జమయితే, ట్రాన్స్‌పోర్ట్ కోడ్‌లో రవాణా చార్జీలు జమవుతాయి.
సిబ్బంది, అధికారుల సాయంతో..
ఆరంభంలో ఆయిల్‌పామ్ సాగు తక్కువగా ఉండటంతో ఒక కుటుంబంలో వేర్వేరు వ్యక్తుల పేరు మీద పట్టాలకు సంబంధించి ఆ కుటుంబంలో ఒకరి పేరు మీదనే ఎఫ్‌కోడ్‌లు జారీ అయ్యాయి. ఆ తర్వాత దశలో ఎకరానికి ఎంత దిగుబడి వస్తుందనే అంశంపై ఇప్పటివరకు కటాఫ్‌ను టీజీ ఆయిల్‌ఫెడ్ నిర్ణయించలేదు. ఎఫ్ కోడ్ కలిగిన రైతు పేరుతో ఎన్ని టన్నుల గెలలు వచ్చాయి, ఎక్కడి నుంచి వచ్చాయనే వివరాల ఆధారంగానే టీజీ ఫెడ్ నుంచి చెల్లింపులు జరుగుతున్నాయి. దీన్ని ఆధారంగా చేసుకుని దమ్మపేట, అశ్వారావుపేటలలో ఉన్న కొందరు భారీ మోసాలకు తెర లేపారు. దీనికి టీజీఫెడ్‌లోని కొందరు సిబ్బంది, అధికారులు చేయి కలపడంతో మూడు పువ్వులు ఆరు కాయలుగా దందా సాగుతోంది.
దూరం (కి.మీ) టన్నుకు చెల్లించే చార్జీ
0 - 15 రూ. 370
16 - 30 రూ. 460
31 - 50 రూ. 560
51 - 85 రూ. 750
86 - 120 రూ. 900
పామాయిల్ సాగులో
దూసుకుపోతున్న
ఉమ్మడి ఖమ్మం


