ఖమ్మంలీగల్: బాలలపై లైంగిక నేరాలను నిరోధించడంలో పోక్సో చట్టం కీలక పాత్ర పోషిస్తుందని జిల్లా మూడో అదనపు జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ న్యాయమూర్తి ఏ.ప్రవీణ్ తెలిపారు. ఈమేరకు ప్రతీ విద్యార్థి హక్కులపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ఖమ్మం శాంతినగర్‌లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పోక్సో(ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రం సెక్సువల్ అఫెన్సెస్) చట్టంపై విద్యార్థులకు గురువారం అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ పిల్లల రక్షణకు చట్టపరమైన భరోసా ఉందనే విషయాన్ని తెలుసుకోవాలన్నారు. ఏదైనా అనుచిత ప్రవర్తన ఎదురైతే భయపడకుండా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు తెలియజేయాలని సూచించారు. ఇదే సమయాన బాలల హక్కులను గౌరవించడం, వారి భద్రతకు ప్రాధాన్యత ఇవ్వడాన్ని సమాజంలోని ప్రతి ఒక్కరు బాధ్యతగా భావించాలని తెలిపారు. ఈ సమావేశంలో ఖమ్మం వన్‌టౌన్ సీఐ షాదిక్ పాషా, హెచ్‌ఎం చల్ల గాని కృపాబాలానందం తదితరులు పాల్గొన్నారు.
మధిరలో అఘోర సాధువు
మధిర: ఉత్తరప్రదేశ్‌లోని బృందావన్‌కు చెందిన అఘోర సాధువు బాబా ప్రేమ్‌గిరి గురువారం మధిర వచ్చారు. ఈ సందర్భంగా అంబికా ఫ్యాన్సీ షాప్‌తో పాటు పలు వ్యాపార సంస్థలకు వెళ్లగా, వ్యాపారులు ఆశీర్వాదాలు పొందారు. ఆయనను చూడడానికి స్థానికులు ఆసక్తి కనబరిచారు.
బైక్‌లో పెట్టిన నగదు మాయం
షాప్‌లోకి వెళ్లొచ్చేసరికి రూ.2.50లక్షలు చోరీ
వైరా: ద్విచక్రవాహనంలో పెట్టిన నగదును గుర్తు తెలియని వ్యక్తులు యజమాని కన్నుగప్పి చోరీ చేశారు. వైరా మండలం విప్పలమడకకు చెందిన మన్నెం మాలాద్రి గురువారం వైరా సొసైటీ కార్యాలయంలో 35గ్రాముల బంగారాన్ని తాకట్టు పెట్టి రూ 2.50లక్షల రుణం తీసుకున్నాడు. నగదును బైక్‌లో పెట్టుకుని వెళ్తూ ఓ షాప్ వద్ద ఆగాడు. షాప్‌లోకి వెళ్లొచ్చేసరికి వాహనంలో నగదు కనిపించలేదు. గుర్తుతెలియని వ్యక్తులు వెంబడించి నగదు చోరీ చేశారనే అనుమానంతో ఫిర్యాదు చేయగా దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ రామారావు తెలిపారు.


