● నీటి కొరతతో పథకం కుదింపు ● ఖమ్మం జిల్లాలో 64, భద్రాద్రి జిల్లాల్లో 61 జలాశయాల్లోనే పిల్లలు ● ప్రభుత్వం అనుమతిస్తే రెండు రోజుల్లో ప్రక్రియ
ఖమ్మంవ్యవసాయం: మత్స్యకారుల ఉపాధి, సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత చేప పిల్లల పథకానికి ఈ ఏడాది నీటి గండం ఎదురైంది. ఎల్‌నినో పరిస్థితులతో జలాశయాల్లో నీరు అడుగంటడంతో ఈ పథకం నానాటికీ కుదించుకుపోతోంది. సాధారణంగా వర్షాకాలం జలాశయాల్లో ఉచితంగా చేప పిల్లలను వదిలి, వాటి సంరక్షణ బాధ్యతను మత్స్య సహకార సంఘాలకు అప్పగిస్తారు. అయితే ఈ ఏడాది జలాశయాల్లో నీరు లేకపోవడంతో పథకం అమలు సాధ్యం కావడం లేదు. అన్ని ఏర్పాట్లు చేసినా, నీటి లభ్యత లేక అధికారులు చేప పిల్లలను వదలలేకపోతున్నారు. దీంతో శాశ్వతంగా నీరుండే జలాశయాల్లో మాత్రమే పథకం అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. నీటిపారుదల శాఖ నివేదికల ఆధారంగా ఆరు నెల ల పాటు 50 శాతానికి పైగా నీరు ఉండే జలాశయాలను గుర్తించే కసరత్తు జరుగుతుంది. ఏటా ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 1,622 జలాశయాల్లో రూ. 6 కోట్ల వ్యయంతో 5.50 కోట్ల చేప పిల్లలను వదిలేవారు. ఈ ఏడాది పరిస్థితులను తలకిందులు కాగా, కేవలం 125 జలాశయాలకే పథకం పరిమితం కానుంది.
ఖమ్మం జిల్లాలో...
జిల్లాలో 882 జలాశయాల్లో రూ. 4.60 కోట్ల విలువైన 3.47 కోట్ల చేప పిల్లలను వదలాలని తొలుత ప్రణాళిక చేశారు. కానీ నీటి కొరతతో ఇప్పుడు కేవలం 64 జలాశయాలకే పరిమితం చేయనున్నారు. పాలేరు, వైరా, బేతుపల్లి రిజర్వాయర్లతో పాటు పెద్ద చెరువుల్లో సుమారు రూ.కోటి విలువైన 1.05 కోట్ల (80–100 మి.మీ సైజు) చేప పిల్లలను వదిలే అంశాన్ని పరిశీలిస్తున్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో...
ఈ జిలాల్లో తొలుత 740 జలాశయాల్లో రూ.2.10 కోట్ల విలువైన 1.76 కోట్ల చేప పిల్లలను వదలాలని నిర్ణయించారు. కానీ నీటి లభ్యత లేక కేవలం 61 జలాశయాల్లో రూ.కోటి విలువైన 77 లక్షల చేప పిల్లలను వదలాలనే ఆలోచనకు వచ్చారు. చర్ల మండలం తాలిపేరు, అశ్వాపురం మండలం తుమ్మలచెరువు, కొత్తగూడెం మండలంలోని సింగభూపాలం వంటి జలాశయాల్లో చేప పిల్లలను పంపిణీ చేసే అంశాన్ని పరిశీలిస్తున్నారు.
ఒకటి, రెండు రోజుల్లో అనుమతి
రాష్ట్రప్రభుత్వం, మత్స్యశాఖ ఒకటి,రెండు రోజుల్లో చేపపిల్లలు వదిలేందుకు అనుమతి ఇవ్వనున్నట్లు తెలిసింది. ఈ విషయమై త్వరలో జరిగే రాష్ట్ర స్థాయిలో నిర్ణయం వెలువడుతుందని చెబుతున్నారు. ఇప్పటికే ఆలస్యమైనందున, శాశ్వతంగా నీరు ఉండే జలాశయాల్లోనైనా చేప పిల్లలను వదిలితే మత్స్యకారులకు ప్రయోజనం కలుగుతుంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో చేపల వేటపై ఆధారపడి 25 వేల మత్స్యకార కుటుంబాలు జీవనం సాగిస్తున్నందున ప్రభుత్వం త్వరగా నిర్ణయం వెలువరించాలని కోరుతున్నారు.


