హుడా కాంప్లెక్స్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం మిట్టగూడెం వద్ద ప్రయాణికురాలు బస్సు నుంచి తోసేయడంతో తీవ్రంగా గాయపడిన కండక్టర్ ప్రవళికను రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పరామర్శించారు. కొత్తపేట సాయి సంజీవని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమెను మంగళవారం రాత్రి పరామర్శించి ఆరోగ్య వివరాలు, వైద్యంపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రయాణికులకు ఇబ్బంది ఎదురైతే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయాలే తప్ప భౌతిక దాడులకు పాల్పడటం సరికాదన్నారు.
ఖమ్మంమయూరిసెంటర్: కండక్టర్ ప్రవళికను ఆర్‌టీసీ ఖమ్మం ఆర్‌ఎం ఏ.సరిరామ్ మంగళవారం పరామర్శించారు. ఆస్పత్రిలో పరామర్శించిన ఆయన చికిత్స వివరాలు తెలుసుకున్నారు. విధి నిర్వహణలో ఉన్న ఉద్యోగులపై దాడులు జరగడం విచారకరమని తెలిపారు.
ఖమ్మం మీదుగా వెళ్లే
పలు రైళ్ల రద్దు
ఖమ్మం రాపర్తినగర్: అర్నబ్ తుపాన్ కారణంగా ఖమ్మం మీదుగా రాకపోకలు సాగించే పలు రైళ్లను రద్దు చేశారు. ఈ వివరాలను ఖమ్మం రైల్వేస్టేషన్ మాస్టర్ రాజేంద్రం వెల్లడించారు. ఈమేరకు మంగళవారం సికింద్రాబాద్ నుంచి హౌరా వెళ్లే ఎక్స్‌ప్రెస్(12704), సికింద్రాబాద్ నుంచి భువనేశ్వర్ వెళ్లే ఎక్స్‌ప్రెస్(17016), హై దరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్లే(12728) రైలు రద్దయిందని తెలిపారు. అలాగే, మహబూబ్‌నగర్ నుంచి విశాఖపట్నం వెళ్లే(12862), సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్లే (12740), లింగంపల్లి నుంచి కాకినాడ వెళ్లే(12776), లింగంపల్లి నుంచి నర్సాపూర్ వెళ్లే(17256), కాకినాడ నుంచి లింగంపల్లి వెళ్లే ఎక్స్‌ప్రెస్‌తో పాటు షిర్డీ ఎక్స్‌ప్రెస్(20810), సంబల్పూర్ నుంచి శ్రీకాకుళం రోడ్డుకు వెళ్లే రైలును రెండు మార్గాల్లో రద్దు చేసినందున ప్రయాణికులు గమనించాలని ఆయన కోరారు.
కొనసాగుతున్న
హెచ్‌ఎంల అధ్యయనం
ఖమ్మంసహకారనగర్: జిల్లాలోని 28 పీఎంశ్రీ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు నాయకత్వ లక్షణాలపై శిక్షణ కోసం మైసూర్‌లోని రీజినల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్(ఆర్‌ఐఈ)కు వెళ్లారు. ఈ సందర్భంగా మంగళవారం ఆర్‌ఐఈ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ప్రద్యుమ్న కుమార్ సేతి మాట్లాడుతూ ప్రధానోపాధ్యాయులు నాయకత్వ లక్షణాలను పెంచుకోవడం ద్వారా విద్యార్థులకు ఉత్తమ బోధన అందడమే కాక పాఠశాల నిర్వహణ మెరుగుపడుతుందని తెలిపారు. ఆర్‌ఐఈలోని పలు విభాగాలను హెచ్‌ఎంలు పరిశీలించగా డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎక్స్‌టెన్షన్ ఎడ్యుకేషన్ ఇన్‌చార్జ్, తెలంగాణ రాష్ట్ర ఇన్‌చార్జ్ ప్రొఫెసర్ డాక్టర్ చంద్రన్న కూడా మాట్లాడారు. బృందంలో జిల్లా అకడమిక్ మానిటరింగ్ అధికారి పెసర ప్రభాకర్‌రెడ్డి, ప్లానింగ్ కో–ఆర్డినేటర్ రామకృష్ణ పాల్గొన్నారు.


