ఆదాయ లక్ష్యం రూ.59 వేల కోట్లు | - | Sakshi
Sakshi News home page

ఆదాయ లక్ష్యం రూ.59 వేల కోట్లు

Oct 28 2026 12:30 AM | Updated on Oct 28 2026 12:30 AM

● ఈ లక్ష్యంతో కార్యాచరణ రూపొందించండి ● జీఎఫ్‌ఎస్‌టీ వైస్‌ చైర్మన్‌ ఎస్పీ టక్కర్‌

● ఈ లక్ష్యంతో కార్యాచరణ రూపొందించండి ● జీఎఫ్‌ఎస్‌టీ వైస్‌ చైర్మన్‌ ఎస్పీ టక్కర్‌

సాక్షిప్రతినిధి, ఖమ్మం: వచ్చే ఏడాది నాటికి జిల్లా ఆర్థిక వ్యవస్థను రూ.59 వేల కోట్లకు చేర్చే లక్ష్యంతో అన్ని రంగాల్లో సమగ్రాభివృద్ధి ప్రణాళిక రూపొందించాలని ఆంధ్రప్రదేశ్‌ మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, జీఎఫ్‌ఎస్‌టీ వైస్‌ చైర్మన్‌ ఎస్పీ టక్కర్‌ సూచించారు. జిల్లా అభివృద్ధి ప్రణాళిక తయారీపై సంబంధిత అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మంగళవారం సమీక్షించారు. ఈ వీసీకి కలెక్టరేట్‌ నుంచి కలెక్టర్‌ దివాకర టీ.ఎస్‌., అదనపు కలెక్టర్‌ డాక్టర్‌ పి.శ్రీజతో పాటు వివిధ శాఖల అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా టక్కర్‌ మాట్లాడుతూ జిల్లా అభివృద్ధి ప్రణాళికను స్థానిక పరిస్థితులు, ప్రజల అవసరాలు, అందుబాటులో ఉన్న వనరులను పరిగణనలోకి తీసుకుని రూపొందించాలన్నారు. జిల్లా తలసరి ఆదాయం రూ.3.30 లక్షలు ఉండగా.. రాష్ట్ర తలసరి ఆదాయంతో పోలిస్తే ఇంకా అభివృద్ధి సాధించాల్సిన అవసరముందని తెలిపారు. జిల్లాలో ఎక్కువ మంది ప్రజలు వ్యవసాయంపై ఆధారపడినా ఆర్థిక వ్యవస్థలో వాటా తక్కువగా ఉందని పేర్కొన్నారు. ప్రాథమిక రంగంపై సుమారు 64 శాతం మంది కార్మికులు ఆధారపడుతుండగా, జిల్లా స్థూల విలువ జోడింపులో వాటా సుమారు 24.2 శాతంగా ఉందని వివరించారు. ద్వితీయ రంగం వాటా సుమారు 12.9 శాతం కాగా, సేవా రంగం వాటా సుమారు 63 శాతంగా ఉందని తెలిపారు. పారిశ్రామిక రంగ వృద్ధికి సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలను ప్రోత్సహిస్తూ, సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. అలాగే, మహిళా సంఘాల ద్వారా చేపట్టే వ్యాపారాలు, స్వయం ఉపాధి కార్యక్రమాలు, ఉత్పత్తుల తయారీ, మార్కెటింగ్‌ అవకాశాలను విస్తరించడంతో పాటు ఖమ్మం ఐటీ టవర్‌లో ఇంకా ఎన్ని ఉద్యోగ అవకాశాలు కల్పించవచ్చో గుర్తించాలని పేర్కొన్నారు.

సమగ్ర అభివృద్ధి ప్రణాళిక

జిల్లా సమగ్ర అభివృద్ధి ప్రణాళికలో భాగంగా ఏర్పాటు చేసిన 11 గ్రూపులు తమ పరిధిలోని అంశాలను సమగ్రంగా అధ్యయనం చేసి, అందుబాటులో ఉన్న గణాంకాలు, ప్రస్తుత పరిస్థితులు, అవకాశాల ఆధారంగా లక్ష్యాలను నిర్దేశించు కోవాలని ఆయన సూచించారు. మహిళా సంఘాలు, ఆరోగ్యం, పోషకాహారం, విద్య, నైపుణ్యాభివృద్ధి, పరిశ్రమలు, సేవారంగం, పట్టణాభివృద్ధి, పర్యాటకం, రవాణా, తాగునీరు, సాగునీరు, వ్యవసాయ అనుబంధ రంగాలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోవాలన్నారు. అనంతరం అధికారులతో సమావేశమైన కలెక్టర్‌ దివాకర మాట్లాడుతూ అభివృద్ధి ప్రణాళిక రూపకల్పనలో సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement