● వారంలో రూ.800 పెరిగిన ధర ● ఖమ్మం మార్కెట్‌లో గరిష్టంగా రూ.23,500గా నమోదు
ఖమ్మంవ్యవసాయం: మిర్చి ధరకు మళ్లీ రెక్కలు వచ్చాయి. వారం వ్యవధిలోనే క్వింటాకు ఏకంగా రూ.800 పెరగడం రైతుల్లో ఆశలను చిగురింపజేస్తోంది. ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో మంగళవారం తేజ రకం మిర్చి జెండా పాట ధర రూ.23,500గా పలికింది. ఈ ఏడాది ఇదే అత్యధిక ధర కావడం విశేషం. ఈనెల ఆరంభంలో రూ.21,350 ఉండగా, క్రమంగా 13వ తేదీ నాటికి రూ.22,000కు చేరింది. సోమవారం రూ.23,150గా నమోదైన ధర మంగళవారం ఒకేసారి రూ.350 పెరిగి రూ.23,500కు చేరడం చర్చనీయాంశంగా మారింది.
సాగు లేక.. డిమాండ్ పెరిగి
సాగు విస్తీర్ణం తగ్గడమే ధర పెరుగుదలకు కారణంగా భావిస్తున్నారు. ఎల్‌నినో నేపథ్యాన మిర్చి సాగు విస్తీర్ణం పడిపోయింది. ఆపై పైరు తెగుళ్ల బారిన పడి దిగుబడులు తగ్గడంతో డిమాండ్‌కు తగ్గట్టు సరఫరా లేక ధరలు పెరుగుతున్నాయి. ఘాటు అధికంగా ఉండే తేజ మిర్చిని దేశీయంగానే కాక బంగ్లాదేశ్, మలేషియా, సింగపూర్ దేశాలకు ఎగుమతి చేస్తుండడం ధర పెరగడానికి దోహదపడుతోంది.


