● నకిలీ సర్టిఫికెట్లతో విధుల్లో చేరిన వారిపై వేటు ● ఆగస్టు 18నే వెల్లడించిన ‘సాక్షి’
మధిర: నకిలీ ధ్రువపత్రాలతో జూనియర్ లెక్చరర్ ఉద్యోగాల్లో చేరిన నలుగురిని ప్రభుత్వం సర్వీస్ నుంచి తొలగించింది. ఈమేరకు వరంగల్ ఆర్‌జేడీ కార్యాలయం నుంచి సోమవారం ఉత్తర్వులు వెలుపడ్డాయి. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో అధ్యాపకులుగా ఎంపికై న 35 మంది నకిలీ సర్టిఫికెట్లు సమర్పించినట్లు కొన్నాళ్ల క్రితం గుర్తించారు. ఇందులో ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి నలుగురు ఉన్న విషయమై ఆగస్టు 12న ‘సాక్షి’లో ’బోధించే వారే దారి తప్పారు’ శీర్షికన కథనం ప్రచురితమైంది. వీరికి షోకాజ్ నోటీసులు ఇచ్చి వివరణ తీసుకున్న అనంతరం పూర్తిస్థాయిలో విచారించాక సర్వీస్ నుంచి తొలగించారు.
2023లో నియామకం
గత ప్రభుత్వ హయాంలో 2023 ఏప్రిల్ 4న ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో రెగ్యులర్ అధ్యాపకులను నియమించారు. ఇందులో పలువురు కాంట్రాక్టు లెక్చరర్లుగా విధులు నిర్వర్తించిన వారు కూడా ఉన్నారు. అయితే, నియామకాలు జరిగాక సర్టిఫికెట్ల పరిశీలన చేపట్టారు. ఈమేరకు మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాల నుంచి గంటా కృష్ణ, వైరా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పనిచేస్తున్న ఎస్.కే.రోషన్‌బీ, భద్రాద్రి జిల్లా పినపాక ప్రభుత్వ జూనియర్ కళాశాల నుంచి యాకయ్య, అశ్వారావుపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల నుంచి చాంద్ పాషా నకిలీ ధ్రువపత్రాలు సమర్పించినట్లు టాస్క్‌ఫోర్స్ బృందం గుర్తించింది. ఇందులో గంటా కృష్ణ బిహార్ రాష్ట్రంలోని బోద్ గయలో ఉన్న మగధ యూనివర్సిటీలో పీజీ చేసినట్లు సర్టిఫికెట్ సమర్పించగా విచారణలో ఆయన అక్కడ పీజీ చేయనట్లు తేలింది. ఈమేరకు నలుగురిని ఉద్యోగం నుంచి పూర్తిగా తొలగించగా, కేసులు కూడా నమోదు చేసినట్లు తెలిసింది.


