కాంగ్రెస్‌ది మోసపూరిత పాలన | - | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌ది మోసపూరిత పాలన

Oct 6 2026 12:54 AM | Updated on Oct 6 2026 12:54 AM

● రెండు ఎమ్మెల్సీ స్థానాల్లో బీఆర్‌ఎస్‌దే విజయం ● ఎంపీ వద్దిరాజు రవిచంద్ర

● రెండు ఎమ్మెల్సీ స్థానాల్లో బీఆర్‌ఎస్‌దే విజయం ● ఎంపీ వద్దిరాజు రవిచంద్ర

సాక్షి ప్రతినిధి, ఖమ్మం: అమలు చేయలేని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ మోసపూరిత పాలన సాగిస్తోందని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర విమర్శించారు. రెండున్నరేళ్లలో ఏం చేశారని ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్లు అడగడానికి మంత్రులు, ఎమ్మెల్యేలు వస్తారని ఆయన ప్రశ్నించారు. ఖమ్మంలోని బీఆర్‌ఎస్‌ జిల్లా కార్యాలయంలో సోమవారం గ్రాడ్యుయేట్స్‌ ఎన్నికలపై ఐదు నియోజకవర్గాల ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వద్దిరాజు మాట్లాడుతూ త్వరలో ఎన్నికలు జరగనున్న రెండు ఎమ్మెల్సీ స్థానాల్లో బీఆర్‌ఎస్‌ విజయం ఖాయమన్నారు. పట్టభద్రులంతా తాము బీఆర్‌ఎస్‌ సైనికులమంటూ ఓటు నమోదుకు వస్తుండడం తమ విజయానికి తొలిమెట్టు అని తెలిపారు. బీఆర్‌ఎస్‌ గెలుపు ఖాయమని తెలిసి ఇతర పార్టీల అభ్యర్థులు పోటీలో నిలవడానికి జంకుతున్నారన్నారు. కాగా, ఓట్లు అడగడానికి వచ్చిన మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలను గ్రాడ్యుయేట్లు నిలదీయాలని, డబ్బుతో గెలవాలని చూస్తున్న కాంగ్రెస్‌కు గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. రేవంత్‌రెడ్డి సీఎం అయ్యాక ఏ ఒక్క వర్గం సంతోషంగా లేదని, రాష్ట్రంలో కరెంట్‌ కోతలతో పంటలు ఎండుతున్నాయని ఎంపీ తెలిపారు. ఇక్కడి నాణ్యమైన బొగ్గును రాష్ట్రంలోని థర్మల్‌ ప్రాజెక్టులకు సరఫరా చేయలేని స్థితిలో ప్రభుత్వం ఉందని పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీలు తాత మధుసూదన్‌, తక్కెళ్లపల్లి రవీందర్‌రావు, మాజీ ఎమ్మెల్యేలు కందాల ఉపేందర్‌రెడ్డి, బానోతు చంద్రావతి, జెడ్పీ మాజీ చైర్మన్‌ లింగాల కమల్‌రాజు, నాయకులు ఏనుగుల రాకేష్‌రెడ్డి, శీలంశెట్టి వీరభద్రం, బెల్లం వేణు, పగడాల నరేందర్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement