లెక్కే లేదు..
నామమాత్రంగా వైద్య, ఆరోగ్య శాఖ తనిఖీలు
నోటీసులతోనే సరిపెడుతున్న యంత్రాంగం
ఖమ్మం వైద్యవిభాగం: జిల్లాలో ప్రైవేట్ ఆస్పత్రుల యాజమాన్యాలు నిబంధనలను బేఖాతర్ చేయడమే కాక ప్రజలను పీల్చిపిప్పి చేస్తున్నాయనే ఆరోపణలున్నాయి. ఈక్రమాన ఆస్పత్రుల ఆగడాలను అదుపులో పెట్టాల్సిన జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు తీరు అందుకు విరుద్ధంగా ఉండడం విమర్శలకు తావిస్తోంది. చికిత్స కోసం వచ్చే వారిని పలు ప్రైవేట్ ఆస్పత్రులు, డయాగ్నస్టిక్ సెంటర్లు, ల్యాబ్‌ల యాజమాన్యాలు దోచుకుంటున్నాయని తెలుస్తున్నాఅధికారులు నామమాత్రపు తనిఖీలతో సరిపెడుతున్నారు. ఆపై ఎలాంటి చర్యలు తీసుకున్న దాఖలాలు లేకపోవడం గమనార్హం.
తొమ్మిది నెలల్లో 14 తనిఖీలే
ఈ ఏడాది ఇప్పటివరకు కేవలం 14 ఆస్పత్రుల్లోనే అధికారులు తనిఖీ చేయడం గమనార్హం. అది కూడా అనుమతి లేవని తెలిశాక తనిఖీ చేసి తాత్కాలికంగా మూసివేశారు. అయితే, యాజమాన్యాలు వేరే మార్గాలు ఎంచుకుని కొన్నాళ్లకే తిరిగి తెరుస్తున్నారు. కాగా, అధికారులు తనిఖీ చేసేవి కూడా చిన్న స్థాయిలోని ఆస్పత్రులు, క్లినిక్‌లు కాగా.. బడా ఆస్పత్రుల వైపు కన్నెత్తి చూసిన దాఖలు లేవనే చెప్పాలి. ఆయా యాజమాన్యాలకు రాజకీయ పలుకుబడి ఉండడం.. కొందరితో లాలూచీ పడడం వంటి కారణాలతో ఈ పరిస్థితి నెలకొందని తెలుస్తోంది.
ప్రాణాలతో చెలగాటం
చాలా ఆస్పత్రులు ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నాయి. క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ప్రకారం ఆస్పత్రి ఏర్పాటు చేయాలంటే వైద్య, ఆరోగ్య శాఖ అనుమతి అవసరం. రిజిస్ట్రేషన్‌తో పాటు ఫైర్ సేఫ్టీ, గదుల వైశాల్యం, అర్హత కలిగిన వైద్యులు, పారామెడికల్ సిబ్బంది ఉండాలి. అలాగే వైద్యులు, చికిత్సల వారీగా ధరల పట్టి ఏర్పాటు చేయాలి. కానీ చాలా ఆస్పత్రుల్లో ఇవేమీ కనిపించవు. సీజన్ వారీగా ఫీజులు పెంచడం, మోతాదుకు మించి మందులు ఇస్తూ రోగుల ప్రాణాలతో చెలగాటం ఆడడడం.. కొన్ని చోట్ల వైద్యులు లేకున్నా నర్సింగ్ సిబ్బందితో వైద్యం చేయిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాత్రిపూట ఎవరైనా విషమ పరిస్థితి ఉన్న వారి తీసుకొస్తే సిబ్బంది తమ వైద్యులకు వీడియోకాల్‌లో చేసి అక్కడి నుంచి వచ్చే సూచనల ఆధారంగా వైద్యం చేస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి. అంతేకాక అర్హత లేకున్నా శస్త్ర చికిత్సలు చేస్తున్నారని తెలుస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. ఇవన్నీ కాక బయో మెడికల్ వ్యర్ధాల నిర్వహణపై యాజమాన్యాలు తేలిగ్గా తీసుకుంటుండడంతో వ్యాధుల వ్యాప్తి పెరగడానికి కారణమవుతోంది.
ప్రతీ ప్రైవేట్ ఆస్పత్రి, క్లినిక్‌లు, డయాగ్నస్టిక్ కేంద్రాలు తప్పకుండా రక్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ప్రకారం నిబంధనలు పాటించాలి. అంతేకాక వైద్య, ఆరోగ్య శాఖ అనుమతి తీసుకోవాలి. అర్హులైన వైద్యులు, సిబ్బందిని నియమించుకోవాలి. పారదర్శకంగా సేవలు అందిస్తూ రోగుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి. ఈ విషయంలో నిఘా వేసి, నిబంధలు ఉల్లంఘిస్తే వరిపై చర్యలు తీసుకుంటాం.
– డాక్టర్ రామారావు, డీఎంహెచ్ఓ
జిల్లాలో ప్రైవేట్ ఆస్పత్రులు, డయాగ్నస్టిక్ సెంటర్లు, ల్యాబ్‌లు కలిపి 582 రిజిస్ట్రేషన్ కలిగి ఉన్నాయి. ఇక అనుమతి లేని ఆస్పత్రులు, క్లినిక్‌లు ఎన్ని నడుస్తున్నాయనే అంతుపట్టని పరిస్థితి నెలకొంది. గతంలో ఖమ్మం నగరానికే పరిమితమయ్యే హైటెక్ ఆస్పత్రులు, ల్యాబ్‌లు సత్తుపల్లి, మధిర, కల్లూరు, వైరా, కూసుమంచి, ముదిగొండ, కల్లూరు తదితర ప్రాంతాల్లోనూ ఏర్పాటయ్యాయి. చాలాచోట్ల కనీస ప్రమాణాలు పాటించకపోయినా.. వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు వారికి గుర్తుకొచ్చినప్పుడు తనిఖీ చేసి వదిలేస్తున్నారు.
ఇష్టారాజ్యంగా ప్రైవేట్ ఆస్పత్రులు, ల్యాబ్‌ల నిర్వహణ


