● గరిష్ట స్థాయికి వ్యవసాయ విద్యుత్ డిమాండ్ ● ఆటంకాల పరిష్కారానికి విద్యుత్ శాఖ పాట్లు
ఖమ్మంవ్యవసాయం: వర్షాభావ పరిస్థితుల్లో పంటలను కాపాడుకునేందుకు రైతులు బోర్లు, బావులపై ఆధారపడుతున్నారు. దీంతో జిల్లాలో వ్యవసాయ విద్యుత్ డిమాండ్ ఎన్నడూ లేనంతగా పెరిగింది. కోటాకు మించి వినియోగం నమోదవుతుండగా, లో ఓల్టేజ్ సమస్యలు తలెత్తుతున్నాయి. ట్రాన్స్‌ఫార్మర్లపై ఒత్తిడి పెరిగి రోజుకు పది వరకు కాలిపోతున్నట్లు తెలుస్తోంది. మరోపక్క రైతుల మోటర్లపైనా ఒత్తిడి పెరిగి కాలిపోతున్నాయి. ఈమేరకు అటు ఉద్యోగులు, ఇటు రైతులకు తిప్పలు తప్పడం లేదు.
పరిష్కారానికి విద్యుత్ శాఖ చర్యలు
విద్యుత్ సమస్యలను అధిగమించేందుకు పకడ్బందీ చర్యలు చేపట్టినట్లు ఎస్‌ఈ ఇనుగుర్తి శ్రీనివాసాచారి తెలిపారు. జిల్లాలో 34,455 ట్రాన్స్‌ఫార్మర్లు ఉండగా ఎనిమిది సెంటర్లలో ముందుగానే 311 ట్రాన్స్‌ఫార్మర్లను అదనంగా సిద్ధం చేశామని చెప్పారు. ఎక్కడైనా ట్రాన్స్‌ఫార్మర్ కాలిపోతే ఆ స్థానంలో 1–2 రోజుల్లోనే కొత్తది అమరుస్తున్నామని, లోడ్ ఎక్కువ ఉన్న చోట అధిక సామర్థ్యం ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. వీటిని తమ శాఖ సొంత వాహనాలు, లేదా అద్దె వాహనాల్లోనే తరలిస్తూ రైతులపై భారం వేయడం లేదని స్పష్టం చేశారు. ఎక్కడైనా ఇబ్బంది ఉంటే స్థానిక ఉద్యోగులకు లేదా కంట్రోల్ రూం నంబర్ 1912, టోల్ ఫ్రీ నంబర్ 1800 425 0028 లేదా ఎస్‌ఈ కార్యాలయంలోని 87124 83490 నంబర్‌కు సమాచారం ఇవ్వాలని ఆయన సూచించారు.


