రిమోట్‌తో కాంటాలో మార్పులు
కొణిజర్ల: పత్తి తూకం వేసే ఎలక్ట్రానిక్ కాంటాకు రిమోట్ అమర్చి రైతులను మోసం చేస్తున్న ఘటన మండలంలోని మల్లుపల్లిలో వెలుగులోకి వచ్చింది. చింతకాని మండలంలోని ఓ గ్రామానికి చెందిన వ్యాపారి మనుషులు ట్రాలీతో మల్లుపల్లికి ఈనెల 4న వచ్చారు. లూజ్ పత్తి కొంటామని మైక్‌లో ప్రచారం చేయడంతో పలువురు రైతులు ముందుకొచ్చారు. అయితే, పత్తి కాంటా వేసే సమయాన నిశితంగా పరిశీలించడంతో ఓ వ్యక్తి రిమోట్ నొక్కుతున్నట్లు తేలింది. అదేమిటని ఆరా తీయగా రిమోట్ సెన్సార్ ద్వారా ఎక్కువ పత్తిని తక్కువ బరువుతో చూపిస్తున్నట్లు గుర్తించారు. క్వింటాకు 5 – 6 కేజీలు అదనంగా తూకం వేస్తున్న వ్యాపారి సంబంధీకులు రెండు రోజుల పాటు గ్రామంలో దాదాపు 200 క్వింటాళ్ల పత్తి కొనుగోలు చేసినట్లు తెలిసింది. ఈ విషయమై రైతులంతా నిలదీయడంతో సేకరించిన పత్తికి సమానంగా డబ్బు చెల్లించేందుకుకు పెద్ద మనషుల సమక్షాన ఒప్పుకున్నట్లు సమాచారం.


