కొణిజర్ల: కొణిజర్ల మండలంలోని పలుచోట్ల అక్రమార్కుల తీరుతో కొండలు, గుట్టలు కరిగిపోతున్నాయి. వీరికి ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకుల సహకారం ఉండడంతో అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. కొణిజర్ల మండలం పెద్దగోపతి రెవెన్యూ పరిధి పెద్దగోపతి, చింతకాని మండలం కోమట్లగూడెం మధ్య సర్వే నంబర్ 541లో సుమారు 40 ఎకరాలు భూమి ఉంది. ఇందులో అసైన్డ్ భూభాగంలో గుట్ట ఉండగా.. పెద్దగోపతికి చెందిన ఇద్దరు, కొండవనమాలకు చెందిన మరో వ్యక్తి రెండు జేసీబీలతో తవ్విస్తూ ట్రాక్టర్ల ద్వారా తరలిస్తున్నారు. దూరం ఆధారంగా ట్రాక్టర్కు రూ.800 నుంచి రూ.వేయి వసూలు చేస్తున్నట్లు సమాచారం. చాన్నాళ్లుగా ఈ దందా జరుగుతున్నా పట్టించుకోని రెవెన్యూ అధికారులు, పోలీసులకు ఫిర్యాదులు పెరగడంతో సోమవారం తనిఖీకి వెళ్లారు. ఈ విషయం ముందుగానే తెలియడంతో వాహనాలతో సహా మట్టి తవ్వకందారులు పరారయ్యారు. ఈ విషయమై ఆర్ఐ రమేష్ మాట్లాడుతూ అసైన్డ్ భూమిలో మట్టి తవ్వకాలు జరపొద్దని హెచ్చరించడంతో పాటు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.


