‘తేజ’స్సు తగ్గుతోంది.. | - | Sakshi
Sakshi News home page

‘తేజ’స్సు తగ్గుతోంది..

Oct 5 2026 12:21 AM | Updated on Oct 5 2026 12:21 AM

గుంటూరు వైపు

వ్యాపారుల చూపు

ఎగుమతులు లేక మిర్చి ధరపై ప్రభావం

చేతులెత్తేసిన చైనా, బంగ్లాదేశ్‌కు

అరకొరగానే..

కోల్డ్‌ స్టోరేజీల్లో మగ్గుతున్న

40 శాతం మిర్చి

ప్రతికూల పరిస్థితులతో ఇబ్బందులు

ఖమ్మంవ్యవసాయం: ‘తేజా’రకం మిర్చి ధర మళ్లీ వెనకడుగు వేస్తోంది. గత వారం వరకు ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో క్వింటా ధర రూ.23వేలు పలకగా, ప్రస్తుతం రూ.22,500కు పడిపోయింది. విదేశీ ఆర్డర్లు లేకపోవడం, మధ్యప్రదేశ్‌లో కొత్త సీజన్‌ ప్రారంభం, రేట్‌ డిఫరెన్స్‌(ఆర్డీ)పై ప్రభుత్వ కఠినంగా వ్యవహరిస్తుండడం ధర తగ్గడానికి కారణాలుగా చెబుతున్నారు. ఈనేపథ్యాన రైతులు, కోల్డ్‌ స్టోరేజీల్లో సరుకు నిల్వ చేసిన వ్యాపారులను ఆందోళనకు గురిచేస్తోంది.

ఎగుమతులే కీలకం

తెలుగు రాష్ట్రాల్లో పండే తేజ రకం మిర్చికి దేశీయ మార్కెట్‌ కంటే అంతర్జాతీయ మార్కెట్లోనే డిమాండ్‌ ఎక్కువ ఉంటుంది. కారం, ఆయిల్‌, రంగుల తయారీలో వినియోగించే ఈ రకానికి చైనాలో విపరీతమైన గిరాకీ ఉంది. చైనాతో పాటు థాయిలాండ్‌, మలేషియా, సింగపూర్‌, బంగ్లాదేశ్‌ తదితర దేశాల్లో తేజ మిర్చిని ఆహార ఉత్పత్తులు, మసాలా దినుసుల తయారీలో వినియోగిస్తారు. ఆయా దేశాల నుంచి వచ్చే ఆర్డర్ల ఆధారంగా ఎగుమతిదారులు కొనుగోలు చేస్తుండగా.. ఖమ్మం మార్కెట్‌ ఎగుమతులకు కేంద్ర బిందువుగా నిలుస్తోంది.

చైనా ఆర్డర్లు బంద్‌.. బంగ్లాకే పరిమితం

ప్రస్తుతం చైనా నుంచి ఆర్డర్లు పూర్తిగా నిలిచిపోవడంతో ఎగుమతులు దాదాపు నిలిచిపోయాయి. వాణిజ్య ఉద్రిక్తతలు, అక్కడ దిగుమతి సుంకాల ప్రభావం తేజ ఎగుమతులపై పడినట్లు వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం అరకొరగా బంగ్లాదేశ్‌ నుంచి మాత్రమే వస్తున్న ఆర్డర్ల ఆధారంగా ఎగుమతులు జరుగుతున్నాయి. దీంతో డిమాండ్‌ లేక, గత ఏడాది పండించి కోల్డ్‌ స్టోరేజీల్లో నిల్వ చేసిన మిర్చిని దేశీయ ధరల ఆధారంగా విక్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనికి తోడు మధ్యప్రదేశ్‌లో కొత్త మిర్చి సీజన్‌ ప్రారంభం కూడా మరో కారణమని.. కొత్త సరుకు వచ్చే కొద్దీ నిల్వ సరుకు ధర మరింత తగ్గే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

40 శాతానికి పైగా నిల్వలు

జిల్లాలో 48 కోల్డ్‌ స్టోరేజీలు ఉండగా.. వీటి నిల్వ సామర్థ్యం సుమారు 48 లక్షల బస్తాలు. గత సీజన్‌లో నిల్వ చేసిన మిర్చిలో సుమారు 26 లక్షల బస్తాలు విక్రయం కాగా, ఇంకా 22 లక్షల బస్తాలు నిల్వ ఉన్నట్లు అంచనా. మరో 2 – 3 నెలల్లో కొత్త సీజన్‌ మొదలైతే నిల్వ మిర్చి పరిస్థితి ఏమిటనే ఆందోళన రైతులు, వ్యాపారుల్లో నెలకొంది. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు జోక్యం చేసుకుని ఎగుమతులను ప్రోత్సహిస్తే తప్ప ఫలితం ఉండదని చెబుతున్నారు.

మిర్చి ఎగుమతుల్లో రేట్‌ డిఫరెన్స్‌(ఆర్‌డీ) వ్యవహారం ఖమ్మం మార్కెట్లో ధర తగ్గుదలకు మరో కారణంగా వ్యాపార వర్గాలు పేర్కొంటున్నాయి. ఎగుమతిదారులు విదేశీ ఆర్డర్లలో ఒక ధర ఒప్పందం చేసుకుని, ఇక్కడ తక్కువ ధరకు కొనుగోలు చేసి మధ్యలో మిగిలే తేడాను మిగుల్చుకోవడం ఆనవాయితీగా ఉండేది. ఇలా చేయడం ప్రభుత్వ ఆదాయంపై ప్రభావం చూపుతోందని గుర్తించారు. ఇకపై కొనుగోలు ధరనే ఎగుమతి బిల్లుల్లో చూపించాలని ప్రభుత్వం నిబంధన విధించగా.. లాభం తగ్గిందని భావిస్తున్న కొందరు ఎగుమతిదారులు ఖమ్మం నుంచి కాక గుంటూరు తదితర మార్కెట్ల నుంచి మిర్చి సేకరిస్తుండడం ధరపై ప్రభావం పడుతోందన్న చర్చ జరుగుతోంది.

కొద్దినెలలుగా ఖమ్మం మార్కెట్‌లో

‘తేజా’ మిర్చి ధరలు (క్వింటాకు రూ.ల్లో)

నెల తేదీ ధర

జూలై 02 21,900

జూలై 27 22,700

జూలై 30 23,050

జూలై 31 23,350

(అత్యధికం)

ఆగస్టు 03 23,200

ఆగస్టు 21 23,000

సెప్టెంబర్‌ 10 23,000

సెప్టెంబర్‌ 21 23,200

సెప్టెంబర్‌ 28 22,750

ఈనెల 01 22,500

తేజా రకం మిర్చి చైనా దేశానికి ఎగుమతులు లేకపోవడం ధరలో ప్రతికూల పరిస్థితి ఎదురవుతోంది. ఈ ఏడాది ధర ఆశాజనకంగా ఉందని భావిస్తుండగానే ఎగుమతులు లేకపోవడం, దేశీయంగా డిమాండ్‌ తగ్గడంతో ధర వెనకడుగు వేస్తోంది. మధ్యప్రదేశ్‌లో సీజన్‌ మొదలుకావడం కూడా మరో కారణం. కోల్డ్‌ స్టోరేజీల్లో పంట నిల్వ ఉండడంతో రైతులు, వ్యాపారుల్లో ఆందోళన నెలకొంది.

– యడ్లపల్లి సతీష్‌,

కార్యదర్శి, చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ మిర్చి శాఖ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement