ఖమ్మంగాంధీచౌక్: తెలంగాణ కథా సాహిత్యం చరిత్రాత్మకమైనది, జీవితమంత విశాలమైనదని కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, తెలంగాణ సాహిత్య అకాడమీ పూర్వ అధ్యక్షుడు డాక్టర్ నందిని సిధారెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలో ఆదివా రం జరిగిన ‘ఖమ్మం కథా స్ఫూర్తి సాహిత్య ఉత్సవం’లో భాగంగా ధరణికోట రమేష్‌కుమార్, ప్రసేన్, సీతారాం, రవిమారుత్ సంపాదకత్వంలో వెలువడిన ‘గుమ్మి – తెలంగాణ కథా సంకలనం’ను ఆవిష్కరించారు. అనంతరం సిధారెడ్డి మాట్లాడుతూ.. చాన్నాళ్లు తెలంగాణ కథ విస్మరణకు గురైందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగు కథలోనే తెలంగాణ కథ ఉంటుందని, 2003లోనే తెలంగాణ కథా సంకలనాన్ని కర్ర మల్లారెడ్డి వెలువరించారని గుర్తు చేశారు. ఆ తర్వాత సంగిశెట్టి శ్రీనివాస్, వెల్దండి శ్రీధర్ సంపాదకత్వంలో తెలంగాణ కథను ముందుకు తీసుకురాగా, దళిత, మైనార్టీ, ఆదివాసీల కథలు వస్తున్నాయని తెలిపారు. ఈ క్రమంలోనే ఖమ్మం నుంచి ‘గుమ్మి’సంకలనం రావడం చరిత్రాత్మక అంశంగా అభివర్ణించారు. తెలంగాణ సాహి త్య చరిత్ర రచయిత డాక్టర్ సుంకిరెడ్డి నారాయణరెడ్డి మాట్లాడుతూ.. గురజాడ అప్పారావు కంటే ముందే తెలంగాణ కథ మొదలైన నేపథ్యాన్ని వివరించారు. కథకులు ఆడెపు లక్ష్మీపతి, కథా రచయిత శిరంశెట్టి కాంతారావు, కుప్పిలి పద్మ, వంశీకృష్ణ, కొండపల్లి నిహారిణి, బీ.వీ.ఎన్.స్వామి, నెల్లుట్ల రమాదేవితో పాటు సంకలనంలో కథలు రాసిన రచయితలు మాట్లాడారు.
నలుగురికి కథా పురస్కారాలు
కథా రచయిత్రులు స్వర్ణ కిలారి, శ్రీ ఊహ, గాజోజి నాగభూషణం, కొట్టం రామకృష్ణారెడ్డి కథా సంపుటిలకు ఖమ్మం కథా పురస్కారాలు ప్రకటించారు. ఈ సందర్భంగా వారిని సన్మానించి పురస్కారాలు అందజేశారు. కవులు, రచయితలు మన్ ప్రీత్, అరుణ్ మన్నె ఏలియా, అరుణ్‌కుమార్, సిద్దెంకి యాదగిరి, గుడిపల్లి నిరంజన్ వనపట్ల సుబ్బయ్య ఎదిరేపల్లి కాశన్న, ఇబ్రహీం, నిర్గుణ్, శ్రీనివాస్ సూఫి, కన్నెగంటి వెంకటయ్య, నామా పురుషోత్తం, దాసరోజు శ్రీనివాస్, సుభాషిణి, మువ్వా జయశ్రీ,ఫణి, మాధవి, రౌతు రవి, ఎన్.తిర్మల్ పాల్గొన్నారు.
కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత సిధారెడ్డి


