మైనింగ్ ఏడీపై మంత్రి ఆగ్రహం
● అల్లీపురంలో ఈనెల 12న భూమిపూజ ● రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
శ్రీవారి ఆలయం
ఖమ్మం అర్బన్: ఖమ్మం అల్లీపురం వద్ద తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యాన శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ నిర్మాణం చేపట్టనున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. ఆలయ నిర్మాణ స్థలాన్ని శనివారం పరిలించాక ఆయన మాట్లాడారు. అల్లీపురంలోని 20 ఎకరాల విస్తీర్ణంలో రూ.100 కోట్లతో ఆలయాన్ని నిర్మించనుండగా, ఈనెల 12న టీటీడీ చైర్మన్ భూమిపూజ చేస్తారని తెలిపారు. భూమి పూజకు ప్రముఖులు, ధార్మిక సంస్థలు, అసోసియేషన్ల ప్రతినిధులు, భక్తులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఖమ్మంలో ఇస్కాన్ ఆధ్వార్మయన శ్రీకృష్ణ ఆలయ ఏర్పాటుకు కూడా స్థలం కేటాయించామని తెలిపారు. స్వామినారాయణ్ పాఠశాల, ఇంటిగ్రేటెడ్ స్కూల్, ఇస్కాన్ ఆలయానికి భూకేటాయింపునకు చురుగ్గా పని చేసిన జిల్లా యంత్రాంగాన్ని అభినందించిన మంత్రి.. రైతులకు నష్టం కలగకుండా వారి సమ్మతితోనే భూసేకరణ జరగాలని స్పష్టం చేశారు. కేబుల్ బ్రిడ్జి, మెడికల్ కాలేజీ, రోప్‌వే తదితర అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని, ఇంటిగ్రేటెడ్ ఆర్‌డీఓ కార్యాలయం, హరిత హోటల్ నిర్మాణానికి అనువైన స్థలాలను ఎంపిక చేయాలని సూచించారు.
రైల్వే మార్గాలపై కేంద్రానికి విజ్ఞప్తి
భద్రాచలం – పాండురంగాపురం, సత్తుపల్లి – కొవ్వూరు, పెనుబల్లి – కొండపల్లి రైల్వే మార్గాలపై కేంద్ర రైల్వే శాఖ మంత్రితో ఫోన్‌లో సంప్రదించినట్లు మంత్రి తుమ్మల తెలిపారు. పాండురంగాపురం నుంచి భద్రాచలం(సాకేతపురి – సారపాక) వరకు రైల్వే లైన్ పనులను రెండేళ్లలో పూర్తి చేయాలని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ను కోరగా సానుకూలంగా స్పందించారన్నారు. ఈ రైల్వేలైన్ అందుబాటులోకి వస్తే భద్రాచలం రామయ్య దర్శనానికి భక్తులు సులువుగా వెళ్లొచ్చని, పరిశ్రమలకు ఎగుమతులు, దిగుమతులకు మరింత వేగంగా జరుగుతాయని తెలిపారు. అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి, కేఎంసీ కమిషనర్ అభిషేక అగస్త్య. సుడా చైర్మన్ పువ్వాళ్ల దుర్గాప్రసాద్, మార్కెట్ చైర్మన్ యరగర్ల హనుమంతరావు, నాయకులు, ప్రజాప్రతినిధులు రాయల నాగేశ్వరరావు, దిరిశాల చిన్న వెంకటేశ్వర్లు పి.నీరజ, రావూరి కరుణ, రావూరి సైదబాబు, తుపాకులు యలగొండ స్వామి, కమర్తపు మురళి, సాదు రమేష్‌రెడ్డి, నాగండ్ల దీపక్‌చౌదరి, సంక్రాంతి నాగేశ్వరరావు, పత్తిపాటి అప్పారావు,గుండె ఆదినారాయణ పాల్గొన్నారు.
ఖమ్మంలో మైనింగ్ శాఖ వ్యవహారాలపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. అల్లీపురంలో జరిగిన సమావేశ వేదికపైకి ఇన్‌చార్జ్ ఏడీ రమేష్‌ను పిలిపించి మందలించారు. కలెక్టరేట్ సమీపంలోనే బైరెటీస్ తవ్వకాలు జరుగుతుంటే ఇన్నాళ్లు ఏం చేశారు, పత్రికల్లో కథనాలు వచ్చే వరకు అక్రమాలు వెలుగులోకి రాకపోవడం ఏమిటని ప్రశ్నించారు. కలెక్టర్‌తో సమన్వయం చేసుకుంటూ బాధ్యులను గుర్తించి తక్షణమే అరెస్ట్ చేయడమే కాక ఇప్పటివరకు తరలించిన బైరెటీస్‌కు సంబంధించి బకాయిలను వసూలు చేయాలని ఆదేశించారు. ఇకపై మైనింగ్ సంబంధిత అక్రమాలు జరిగినట్లు తెలిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.


