ప్రతీఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలి
ఖమ్మం సహకారనగర్: ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ(ఐఆర్సీఎస్) జిల్లా మేనేజింగ్ కమిటీని ఎన్నుకునేందుకు ఆదివారం పోలింగ్ నిర్వహించనున్నారు. ఖమ్మంలోని టీటీడీసీలో పోలింగ్ నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇక్కడ 500 మంది చొప్పున ఓటు వేసేలా ఐదు పోలింగ్ బూత్‌లు ఏర్పాటుచేశారు.
15 పదవులకు 39మంది
కలెక్టర్ దివాకర టీ.ఎస్. ఆదేశాలతో జిల్లా ముఖ్యప్రణాళిక అధికారి(సీపీఓ) ఏ.శ్రీనివాస్ ఎన్నికల అధికారిగా వ్యవహరిస్తున్నారు. గత నెల 24న నామినేషన్లు స్వీకరించగా.. 25వ తేదీన పరిశీలించి, ఉపసంహరణ గడువు ముగిశాక 15 పదవులకు 39మంది బరిలో మిగిలినట్లు 26వ తేదీన వెల్లడించారు. కాగా, జిల్లాలో రెడ్‌క్రాస్ సొసైటీ కార్యవర్గాలు పలుమార్లు ఏకగ్రీవం కాగా, ఈసారి పోటీ ఉండడంతో ఎన్నికలు అనివార్యమయ్యాయి. ఈనేపథ్యాన పోటీలో ఉన్న అభ్యర్థులు గతంలో చేసిన సేవలు, ఈసారి గెలిపిస్తే చేయనున్న సేవలపై విస్తృత ప్రచారం నిర్వహించారు. ఎన్నికల నిర్వహణకు టీటీడీసీలో ఏర్పాట్లు చేయగా, 2,430 మంది ఓటర్లు ఓటు వేసేలా ఐదు పోలింగ్ బూత్‌లు ఏర్పాటు చేశారు. ఒక్కో బూత్‌లో నలుగురు ఉద్యోగులు విధులు నిర్వర్తిస్తారు. ఎలాంటి ఘటనలు జరగకుండా పోలీసు బందోబస్తు నిర్వహించనున్నారు.
టీటీడీసీలో ఎన్నికలకు ఏర్పాట్లు
రెడ్‌క్రాస్ సొసైటీ ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. టీటీడీసీలో పోలింగ్ ఉదయం 8నుంచి మధ్యాహ్నం 3గంటల వరకు జరుగుతుంది. ఆతర్వాత ఓట్లు లెక్కించి ఫలితాలు వెల్లడిస్తాం. ఓటర్లు అంతా ఓటు హక్కు వినియోగించుకోవాలి.
– ఏ.శ్రీనివాస్, సీపీఓ, రెడ్‌క్రాస్ ఎన్నికల అధికారి


