తల్లాడ: తల్లాడ మండలంలోని ఎన్నెస్పీ పరిధి సిరిపురం మేజర్ ఆధునికీకరణ పనులు నిలిపివేసి వరి పంటకు సీతారామ ప్రాజెక్ట్ ద్వారా సాగునీరు విడుదల చేయాలని రైతులు డిమాండ్ చేశారు. పొట్ట దశలో ఉన్న పైరు ఎండుతున్నందున అధికారులు స్పందించాలంటూ శనివారం తల్లాడ ఎన్నెస్పీ డివిజన్ కార్యాలయం వద్ద రైతులు ధర్నా చేశారు. గత మూడు నెలలుగా సిరిపురం మేజర్‌లో పనులు జరుగుతుండడంతో ఈ ఏడాది ఖరీఫ్‌లో సాగు నీరే విడుదల చేయలేదని, ఫలితంగా వరి సహా ఇతర పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. బిల్లుపాడు, కొత్త వెంకటగిరి, గాందీనగర్‌తండా, అన్నారుగూడెం రైతులు ధర్నాకు దిగగా ఉదయం 10–30 దాటినా డీఈ, ఏఈలు కార్యాలయానికి రాలేదు. దీంతో విసిగిపోయి రైతులు బస్టాండ్ ఎదురుగా జాతీయ రహదారిపై రాస్తారోకో చేసేందుకు వెళ్తుండగా ఎస్‌ఐ ఎన్.వెంకటకృష్ణ చేరుకుని నచ్చచెప్పారు. జల వనరుల శాఖాధికారుల సూచనతో రెండు రోజుల గడువు విధించి ఆందోళన విరమించారు. కిసాన్ మోర్చా రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఆపతి వెంకటరామారావు, రైతులు మేడా మోహన్‌రావు, ఏగుపాటి హనుమంతురావు, మేడా నరసింహారావు, రాయల రమేష్, గొర్ల మోహన్‌రెడ్డి, ఇంజం వీరభద్రరావు పాల్గొన్నారు.


