మధిర రూరల్: అఖిల భారత న్యాయవాదుల సంఘం(ఐలు) జిల్లా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. మధిరలో శనివారం జరిగిన ఐలు జిల్లా మహాసభల్లో తొలుత సీనియర్ న్యాయవాది బోడేపూడి చంద్రశేఖర్ ఆజాద్ పతకావిష్కరణ చేశారు. అనంతరం పలువురు మాట్లాడుతూ న్యాయవాదుల సమస్యల పరిష్కారం, హక్కుల పరిరక్షణతో పాటు ప్రజలకు న్యాయ సేవలు మరింత చేరువ చేసేలా సంఘం కృషి చేయాలని సూచించారు. అనంతరం ‘ఐలు’ జిల్లా నూతన కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా మీసాల వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శిగా టింకటి వెంకటేశ్వరరావు, కోశాధికారిగా పలివెల శ్రీలక్ష్మి, ఉపాధ్యక్షుడిగా దిరిశాల జగన్మోహన్‌రావు, సహాయ కార్యదర్శిగా చావలి రామరాజుతో పాటు కార్యనిర్వహక అధ్యక్షుడిగా తన్నీరు పాపయ్య తదితరులు ఎన్నికయ్యారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.పార్థసారధి, నేషనల్ కౌన్సిల్ సభ్యుడు ఏడునూతల శ్రీనివాసరావు, తెలంగాణ బార్ కౌన్సిల్ సభ్యులు మందడపు శ్రీనివాసరావు, చందాల శైలజతో పాటు భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు పొనుగోటి కిషన్‌రావు, ఖమ్మం, మధిర, మణుగూరు బార్ అసోసియేషన్ల అధ్యక్షులు యడ్లపల్లి రమేష్, చావలి రామరాజు, గురు కృష్ణ, దిరిశాల జగన్మోహన్‌రావు, కొలిపాక రమేష్‌కుమార్ పాల్గొన్నారు.


