పత్తి రైతుకు పుట్టెడు దుఃఖం | - | Sakshi
Sakshi News home page

పత్తి రైతుకు పుట్టెడు దుఃఖం

Oct 3 2026 12:14 AM | Updated on Oct 3 2026 12:14 AM

రాలిన పూత, పిందె..

నల్లబారిన కాయలు

2–3 క్వింటాళ్ల దిగుబడిపైనా

అనుమానాలే

కొణిజర్ల/తల్లాడ/తిరుమలాయపాలెం: ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు లేక పంటలు అరకొరగా సాగయ్యాయి. ఇందులో మిగతా పంటలతో పోలిస్తే పత్తి సాగు చేసిన రైతులు మాత్రమే దిగుబడిపై ఆశలు పెట్టుకున్నారు. కానీ ఇటీవల తుపాన్‌తో మూడు రోజుల పాటు కురిసిన వర్షాలు వారి ఆశలను తలకిందులు చేశాయి. పంట చేతికొస్తోంది.. అమ్ముకుని పిల్లాపాపలతో దసరా పండుగ జరుపుకోవాలని భావిస్తుండగా పత్తి చేలన్నీ ఎర్రబడి కాయలు నల్లగా మారి పక్వానికి రాకముందే పగిలిపోయాయి. దీంతో పత్తి చేతికి వచ్చే పరిస్థితి లేక.. ఎకరాకు 2 – 3 క్వింటాళ్ల దిగుబడి దాటడం కష్టమేనని భావిస్తున్నారు. అది కూడా వర్షాలతో నాణ్యత తగ్గడంతో ధర పడిపోయే అవకాశముండడం రైతులను ఆవేదనకు గురిచేస్తోంది.

2లక్షలకు పైగా ఎకరాల్లో సాగు

జిల్లాలో ఈ వానాకాలం సీజన్‌లో అన్ని పంటలు కలిపి 5,09,978 ఎకరాల్లో సాగయ్యాయి. ఇందులో అత్యధికంగా వరి 2,41,109 ఎకరాల్లో సాగవగా, ఆ తర్వాత స్థానంలో పత్తి 2,35,637 ఎకరాల్లో రైతులు సాగు చేశారు. జూన్‌లో వర్షం ఆశాజనకంగా ఉండడంతో విత్తనాలు నాటారు. ఆ తర్వాత వరుణుడు ముఖం చాటేయడంతో అందుబాటులో ఉన్న వనరుల ద్వారా పంట కాపాడుకుంటూ వచ్చారు. ఇప్పుడు పూత దశకు చేరుతున్న పత్తి ఇక చేతికి రావడమే తరువాయి అని భావించారు. ఎంతో కొంత దిగుబడి వస్తే అమ్ముకుని దసరా ఘనంగా జరుపుకుందామని అనుకున్నారు. కానీ వారి ఆశలపై ఇటీవల తుపాన్‌ నీళ్లు చల్లింది.

ఎర్రబడిన మొక్కలు, నల్లబారిన కాయలు

తుపాన్‌ ప్రభావంతో ఇటీవల జిల్లాలోని పలు ప్రాంతాల్లో వరుసగా మూడు రోజుల పాటు వర్షం కురిసింది. దీంతో పత్తి చేలలో నీరు నిలవగా, మొక్కలు ఎర్రబడి ఉన్న కాసిన్ని కాయలు నల్లబడిపోయాయి. అంతేకాక పగిలిన కాయల నుంచి పత్తి కారిపోతోంది. ఇక నల్లబడిన కాయలు పక్వానికి రాకముందే పగిలిపోయాయి. కాయ విచ్చుకుని దూది బయటకు వచ్చే సమయాన కురిసిన వానతో ఈ పరిస్థితి ఎదురుకాగా, పంట నాణ్యత తగ్గి ధర గణనీయంగా పడిపోయే అవకాశముంది.

దిగుబడి, ధర కష్టమే

రైతులు పత్తి సాగు కోసం ఎకరానికి రూ.30 వేలు మొదలు రూ.50వేల వరకు పెట్టుబడి పెట్టారు. తీరా పూత, పిందె దశ దాటి చేతికొచ్చే సమయాన కురిసిన వర్షంతో చేన్లలో నీరు నిలిచి మొక్కలు ఎర్రబారడంతో పాటు పూత, పిందెలు రాలిపోతున్నాయని రైతులు చెబుతున్నారు. కొన్నిచోట్ల మొక్కలు పూర్తిగా వాడిపోతున్నాయి. ఎకరాకు కనీసం రెండు, మూడు క్వింటాళ్ల దిగుబడి కూడా వచ్చే పరిస్థితి లేదని.. ఫలితంగా పెట్టుబడులు వచ్చే అవకాశం లేనట్టేనని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఇక కౌలు రైతులు ఇప్పటికే కౌలు నగదు చెల్లించినందున వారి పరిస్థితి మరీ దయనీయంగా మారింది.

కాత దశలో తుపాన్‌తో

ఎర్రబారిన పంట

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement