నేలకొండపల్లి: ఈ ఏడాది జిల్లాలో ఉపాధి హామీ కూలీలకు 2.6 కోట్ల పనిదినాలు కల్పించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు డీఆర్‌డీఓ కొండపల్లి శ్రీరామ్ తెలిపారు. నేలకొండపల్లి మండలం కొత్తకొత్తూరులో శుక్రవారం వీబీజీ రాంజీ పథకం అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. జిల్లాలో జాబ్‌కార్డు కలిగిన ప్రతీ కుటుంబానికి 125 పని దినాలు, రోజుకు రూ.308 కూలీ వేతనాలు అందేలా కార్యాచరణ సిద్ధమైందని తెలిపారు. ప్రతీ ఇంటా ఇంకుడు గుంత, పొలంలో పంట కుంట, ఊరికో ఊట కుంట వంటి పనులు చేపడుతామని, చెరువులు పునరుద్ధరణ, బోర్ల రీచార్జీ పనులను కూడా జాబితాలో చేర్చినట్లు చెప్పారు. కాగా, 18 ఏళ్లు నిండిన ప్రతీ ఒక్కరూ జాబు కార్డుకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ ఎం.యర్రయ్య, ఏఓ ఎం.రాధ, ఎంపీఓ ఎం.శ్రీనివాసరావు, సర్పంచ్ కళావతి, ఉప సర్పంచ్ వల్లాల రాధాకృష్ణ, ఈజీఎస్ ఏపీఓ అమ్మజాన్, ఈసీ శేషగిరిరావు, మార్కెట్ మాజీ చైర్మన్ వెన్నపూసల సీతారాములు, నాయకులు బచ్చలకూరి నాగరాజు, జెర్రిపోతుల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.


