పట్టాదారులకు నోటీసులు, భారీగా జరిమానా కొనుగోలు చేసిన డీలర్ల లైసెన్సులు రద్దు
ఖమ్మం అర్బన్: ఖమ్మం వెలుగుమట్ల ప్రాంతంలో కొన్నేళ్లుగా కొనసాగుతున్న అక్రమ మైనింగ్‌పై జిల్లా యంత్రాంగం కొరఢా ఝళిపించింది. అనుమతి లేకుండా బైరెటీస్ తవ్వి తరలిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ దివాకర టీ.ఎస్. స్పష్టం చేశారు. ఇప్పటికే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశాలతో రెవెన్యూ, మైనింగ్ శాఖల అధికారులు వెలుగుమట్ల ప్రాంతంలో తనిఖీ చేయగా, వెలుగుమట్ల పార్కు సమీపాన పట్టా భూముల్లో కొందరు అనుమతి లేకుండా బైరెటీస్ తవ్వకాలు జరుపుతున్నట్లు గుర్తించారని పేర్కొన్నారు.
చిన్న గుంతలు.. పెద్ద దందా
ఎవరికీ అనుమానం రాకుండా చిన్నపాటి గుంతలు తవ్వి అందులో బైరెటీస్ వెలికితీసి, పగలగొట్టి ట్రాక్టర్ల ద్వారా సమీపంలోని డీలర్లకు విక్రయిస్తున్నట్లు శుక్రవారం నిర్వహించిన ప్రాథమిక విచారణలో అధికారులు తేల్చారు. రాత్రివేళ తవ్వకాలు చేపడుతున్నారనే ఫిర్యాదులు రావడంతో అధికారులు దృష్టి సారించారు. మైనింగ్ అధికారులే కాక ఖమ్మం అర్బన్, రఘునాథపాలెం తహసీల్దార్లు అక్రమ తవ్వకాలు జరుగుతున్న ప్రాంతాన్ని పరిశీలించి కొలతలు నమోదు చేశారు. ఈ క్రమాన తవ్వకానికి పాల్పడిన పట్టాదారులు, ఇతర బాధ్యులను గుర్తించే ప్రక్రియ వేగవంతం చేసినట్లు కలెక్టర్ దివాకర వెల్లడించారు.
డీలర్లపైనా చర్యలు
అక్రమ మైనింగ్‌కు పాల్పడిన వారికి నోటీసులు జారీ చేసి భారీగా జరిమానా విధించనున్నట్లు కలెక్టర్ స్పష్టం చేశారు. అంతేకాక నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా తవ్విన ఖనిజాన్ని కొనుగోలు చేసే డీలర్లపైనా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అవసరమైతే వారి లైసెన్సులు రద్దు చేయడంతోపాటు చట్టపరమైన చర్యలు చేపడతామని తెలిపారు. అక్రమ తవ్వకాలు, ఖనిజ రవాణా, కొనుగోళ్లకు పాల్పడే వారెవరైనా ఉపేక్షించేది లేదని కలెక్టర్ ఒక ప్రకటనలో స్పష్టం చేశారు.
బైరెటీస్ తవ్వకాల కట్టడికి కలెక్టర్ ఆదేశం


