కేసుల పరిష్కారానికి ‘మీడియేషన్‌’ | - | Sakshi
Sakshi News home page

కేసుల పరిష్కారానికి ‘మీడియేషన్‌’

Sep 29 2026 12:39 AM | Updated on Sep 29 2026 12:39 AM

ఖమ్మం లీగల్‌: మధ్యవర్తిత్వానికి అనుకూలమైన కేసులను గుర్తించి, ఇరుపక్షాల పరస్పర అంగీకారంతో సామరస్య పూర్వకంగా పరిష్కరించేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం.నాగరాజు తెలిపారు. జిల్లా కోర్టులో సోమవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వచ్చేనెల 1వ తేదీ నుంచి డిసెంబర్‌ 31వరకు ‘మీడియేషన్‌’పై ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇందులో భాగంగా మధ్యవర్తిత్వానికి అనుకూలమైన కేసులను గుర్తించి, ఇరుపక్షాల అంగీకారంతో సామరస్యంగా పరిష్కరించేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. ఈ విషయమై కక్షిదారులకు విస్తృత అవగాహన కల్పించనుండగా, సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. న్యాయసేవాధికార సంస్థ ద్వారా కక్షిదారులకు సులభంగా, అందుబాటులో స్నేహపూర్వక న్యాయ పరిష్కారం అందించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో న్యాయ సేవాధికారి సంస్థ జిల్లా కార్యదర్శి దేవీమానస పాల్గొన్నారు.

పరిశోధనా కేంద్రంలో మత్స్యకారులకు శిక్షణ

కూసుమంచి: దేశవాళీ కార్ప్‌ చేప పిల్లల విత్తనోత్పత్తి, యాజమాన్య పద్ధతులపై మత్స్యకారులకు ఇచ్చే శిక్షణ సోమవారం మొదలైంది. కూసుమంచి మండలం పాలేరు మత్స్య పరిశోధన కేంద్రంలో ఏర్పాటుచేసిన శిక్షణకు రాజన్న సిరిసిల్ల, హైదరాబాద్‌, వరంగల్‌, ఖమ్మం జిల్లాల మత్స్య రైతులు, మత్స్యకారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీనియర్‌ సైంటిస్ట్‌ డాక్టర్‌ జి.విద్యాసాగర్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో చేప పిల్లల ఉత్పత్తి, హేచరీస్‌ స్థాపనకు అనువైన అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ఈమేరకు ఔత్సాహికులు ముందుకురావాలని సూచించారు. అనంతరం పరిశోధనా కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్‌ ఎం.శ్యాంప్రసాద్‌, శాస్త్రవేత్తలు రవీందర్‌, శాంతన్న పలు అంశాలను వివరించారు.

పోలీసుస్టేషన్‌లో

కేంద్ర బృందం పరిశీలన

ఖమ్మంఅర్బన్‌: జాతీయ స్థాయిలో పోలీసుస్టేషన్లకు ర్యాంకింగ్‌ ఇచ్చే ప్రక్రియలో భాగంగా కేంద్ర బృందం సభ్యులు సోమవారం ఖమ్మం అర్బన్‌ పోలీసుస్టేషన్‌ను పరిశీలించారు. క్వాలిటీ కంట్రోల్‌ విభాగానికి చెందిన ముగ్గురితో కూడిన బృందం రాగా, పలు అంశాలపై వివరాలు సేకరించింది. పోలీసుల పనితీరు, సిబ్బంది సంఖ్య, ప్రజలకు అందుతున్న సౌకర్యాలు, వాహనాల సంఖ్య, పరిసరాల పరిశుభ్రత, రికార్డుల నిర్వహణ, కేసుల నమోదు, దర్యాప్తుపై ఆరా తీసినట్లు తెలిసింది. ఈక్రమాన సీఐ భానుప్రకాశ్‌, సిబ్బంది మాట్లాడి పలు వివరాలు సేకరించారు.

జిల్లా విద్యాశాఖాధికారిగా వాసంతి

ఏడాదిన్నర కాలంలో ఏడో డీఈఓ

ఖమ్మం సహకారనగర్‌: జిల్లా విద్యాశాఖాధికారి(ఎఫ్‌ఏసీ)గా డి.వాసంతిని నియమించారు. ప్రస్తుతం భద్రాద్రి జిల్లా డీఈఓగా ఉన్న ఆమెను ఖమ్మం బదిలీ చేస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. కొన్నాళ్లుగా ఖమ్మం డీఈఓ పోస్టు ఖాళీగా ఉండడంతో స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ జి.సదానందం అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈనేపథ్యాన వాసంతిని నియమించారు.

ఎఫ్‌ఏసీలతోనే కాలం వెళ్లదీత

జిల్లాలో ఏడాదిన్నర కాలంలో ఏడుగురు డీఈఓలు మారారు. వీరిలో ఒక్కరు తప్ప మిగతా వారు పూర్తిస్థాయి అదనపు బాధ్యతలతో విధులు నిర్వర్తించడం గమనార్హం. తొలుత డైట్‌ లెక్చరర్‌ సోమశేఖర్‌శర్మ డీఈఓగా విధులు నిర్వర్తించగా, ఆయన ఉద్యోగవిరమణ తర్వాత సామినేని సత్యనారాయణ, ఆతర్వాత జెడ్పీ డిప్యూటీ సీఈఓ నాగపద్మజకు, ఆపై అదనపు కలెక్టర్‌ శ్రీజకు బాధ్యతలు అప్పగించారు. అనంతరం కరీంనగర్‌ డీఈఓగా ఉన్న చైతన్యజైనీని పూర్తిస్థాయి డీఈఓగా నియమించారు. ఆరు నెలలకే ఆమె యథాస్థానానికి వెళ్లడంతో మళ్లీ ఎస్‌డీసీ సదానందంకు డీఈఓగా అదనపు బాధ్యతలు అప్పగించారు. ప్రస్తుతం వాసంతిని కూడా ఎఫ్‌ఏసీ బాధ్యతలతోనే కేటాయించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement