స్వామినాథన్ సిఫారసులను నీరుగార్చారు
ఏఐకేఎంఎస్ జాతీయ అధ్యక్షుడు వేములపల్లి వెంకట్రామయ్య
ఖమ్మంలో ప్రారంభమైన జాతీయ మహాసభలు
ఖమ్మంమయూరిసెంటర్: దేశంలో అపారమైన వనరులు, సారవంతమైన భూములు, కష్టపడే ప్రజలు ఉన్నప్పటికీ పాలకుల విధానాలతో రైతులు, వ్యవసాయ కూలీలు దారిద్య్రంలో మగ్గుతున్నారని ఏఐకేఎంఎస్ జాతీయ అధ్యక్షుడు వేములపల్లి వెంకట్రామయ్య తెలిపారు. అఖిల భారత రైతు కూలీ సంఘం (ఏఐకేఎంఎస్) నాలుగో జాతీయ మహాసభలు సోమవారం ఖమ్మంలో ప్రారంభమయ్యాయి. తొలిరోజు ఖమ్మంలో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో వెంకట్రామయ్య మాట్లాడారు. ధనవంతులు చనిపోయినప్పుడు ఆస్తులు పంచుకుంటుంటే.. రైతులు, కూలీలు చనిపోతే అప్పులు పంచుకోవా ల్సిన దుస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్రాల్లో ఏ పార్టీ ఉన్నా రైతాంగం విషయంలో వివక్ష మాత్రం తగ్గడం లేదన్నారు. స్వామి నాథన్ కమిషన్ సిఫారసుల అమలుపై ప్రధాని మోదీ ప్రచారానికే పరిమితమయ్యారని, నిజానికి ఆయనే సిఫార్సులకు ద్రోహం చేశారని మండిపడ్డారు. గత 25 ఏళ్లలో తక్కువ మద్దతు ధరల కారణంగా భారతీయ రైతాంగం రూ.110 లక్షల కోట్లు నష్టపోయిందని తెలిపారు. పొరుగు దేశం చైనా భూసంస్కరణలు పక్కాగా అమలు చేయడంతో తలసరి ఆదాయంలో ఐదున్నర రెట్లు ముందు ఉందని చెప్పారు. ఇకనైనా భూస్వాముల వద్ద ఉన్న భూములను పేదలకు పంచేలా సమగ్ర భూసంస్కరణలు అమలు చేయాలని, పండించిన పంటలకు చట్టబద్ధమైన కనీస మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. అలాగే, వ్యవసాయ కూలీలకు సమగ్ర హక్కుల చట్టం తీసుకురావాలని, విద్యుత్ బిల్లుల సవరణ, విత్తన బిల్లుల సవరణ, కార్పొరేట్ అనుకూల చట్టాలను వెంటనే ఉపసంహరించుకోవాలన్నారు. అంతేకాక ఉద్యోగులు, కార్మికుల మాదిరి రైతులు ఐక్యమై సమరశీల రైతు ఉద్యమాలను నిర్మించాల్సిన అవసరం ఉందన్నారు.
భారీ ప్రదర్శన..
ఏఐకేఎంఎస్ జాతీయ మహాసభల సందర్భంగా ఖమ్మంలో భారీ ప్రదర్శన నిర్వహిచారు. తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, ఒడిశా, బిహార్, పంజాబ్, ఝార్ఖండ్, పశ్చిమ బెంగాల్ తదితర రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రతినిధులు, రైతులు, కూలీలు ప్రదర్శనలో పాల్గొన్నారు. పెవిలియన్ మైదానం వద్ద ప్రారంభమైన ప్రదర్శన మయూరిసెంటర్, వైరా రోడ్డు, జెడ్పీ సెంటర్, ఇల్లెందు క్రాస్‌రోడ్డు మీదుగా ఎస్‌ఆర్‌అండ్‌బీజీఎన్‌ఆర్ కళాశాల మైదానానికి చేరుకుంది. సభ ప్రారంభానికి ముందు అమరవీరులకు నివాళులర్పించారు. సభలో ఏఐకేఎంఎస్ జాతీయ అధ్యక్షులు డాక్టర్ ఆశిష్ మిట్టల్, జాతీయ ఉపాధ్యక్షులు నిర్భయ్ సింగ్, సుశాంత్ ఝూ, జే.వీ.చలపతిరావు, నాయకులు జితేందర్ సింగ్, కేదార్ సబర్, ధరమ్‌పాల్, దేబాజిత్, సెల్వరాజ్, శంభుప్రసాద్ సింగ్, గౌని ఐలయ్య, బండారి ఐలయ్య, మండల వెంకన్న, చిట్టిపాటి వెంకటేశ్వర్లు, జి.ఝాన్సీ, టి.శ్రీనివాస్, స్టాలిన్ బాబు, డాక్టర్ గోపీనాథ్ తదితరులు పాల్గొన్నారు.


