హాస్టల్ వెల్ఫేర్ అధికారులు హాస్టళ్లలోనే ఉండాలి
ఖమ్మం సహకారనగర్: ప్రజలు ఇచ్చే ప్రతి ఫిర్యాదు, దరఖాస్తును పరిశీలించి సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ దివాకర టీ.ఎస్. ఆదేశించారు. కలెక్టరేట్‌లో సోమవారం జరిగిన ప్రజావాణి(గ్రీవెన్స్ డే)లో ఆయన అదనపు కలెక్టర్లు శ్రీజ, శ్రీనివాసరెడ్డితో కలిసి ఫిర్యాదులను స్వీకరించారు. అనంతరం అధికారులతో సమావేశమైన ఆయన పరిష్కారంపై సూచనలు చేశారు. కాగా, గత రెండు వారాలు ప్రజావాణి జరగకపోవటంతో ఈసారి రద్దీ పెరిగింది. ప్రజావాణి నమోదు కేంద్రం, అధికారుల వద్ద జనాలు బారులుదీరారు.
పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు
తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ(టాస్) ఆధ్వర్యాన వచ్చే నెల 11 నుంచి జరిగే పదో తరగతి, ఇంటర్ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ దివాకర ఆదేశించారు. కలెక్టరేట్‌లో సోమవారం ఆయన పరీక్షల నిర్వహణపై మాట్లాడుతూ పదో తరగతి పరీక్షలకు ఖమ్మం ప్రభుత్వ బాలికల పాఠశాల, ఇంటర్మీడియట్ పరీక్షలకు రిక్కాబజార్ పాఠశాలలో కేంద్రాలు ఏర్పాటుచేయగా, అన్ని వసతులు కల్పించాలని తెలిపారు. అదనపు కలెక్టర్లతో పాటు డీఈఓ సదానందం, ఓపెన్ స్కూల్ కోఆర్డినేటర్ మంగపతిరావు పాల్గొన్నారు.
రేబిస్ నివారణపై విస్తృత అవగాహన
కుక్క కాటుతో సోకే రేబిస్ వ్యాధి నివారణపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని కలెక్టర్ దివాకర సూచించారు. కలెక్టరేట్‌లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కుక్కలు, ఇతర జంతువుల కాటు ద్వారా రేబిస్ సంక్రమిస్తుందని, సరైన సమయంలో చికిత్స అందకపోతే మరణానికి దారితీసే అవకాశం ఉంటుందని తెలిపారు. ఈమేరకు కుక్క కాటుతో ఎదురయ్యే అనర్థాలు, చికిత్సపై ప్రచారం చేయాలని చెప్పారు. ఆతర్వాత నషా ముక్త్ భారత్ కార్యక్రమంలో భాగంగా ప్రతిజ్ఞ చేశారు. అలాగే, అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవంలో భాగంగా చేపట్టే కార్యక్రమాల వివరాలతో కూడిన పోస్టర్లు ఆవిష్కరించారు.
గ్రీవెన్స్ డేలో కలెక్టర్ దివాకర టీ.ఎస్.
ఖమ్మంమయూరిసెంటర్: హాస్టల్ వెల్ఫేర్ అధికారులు తప్పకుండా హాస్టళ్లలోనే ఉండాలని కలెక్టర్ దివాకర స్పష్టం చేశారు. విద్యార్థుల సంక్షేమం, సురక్షితమైన, పరిశుభ్రమైన, వాతావరణం కల్పించేందుకు పర్యవేక్షించాలని తెలిపారు. రెసిడెన్షియల్ విద్యాసంస్థల నిర్వహణ, విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు వీసీ ద్వారా సమీక్షించారు. ఖమ్మం నుంచి కలెక్టర్ దివాకర, అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ, ట్రైనీ అసిస్టెంట్ కలెక్టర్ పారస్ కుమార్ పాల్గొనగా.. ఆతర్వాత అధికారులతో కలెక్టర్ సమావేశమయ్యారు. ఆకస్మిక తనిఖీకి వచ్చినప్పుడు హాస్టల్ వెల్ఫేర్ అధికారులు అందుబాటులో లేనట్లు తేలితే సస్పెండ్ చేస్తామని స్పష్టం చేశారు. కాగా, సూపర్‌వైజింగ్ అధికారులు వారానికి కనీసం రెండు హాస్టళ్లను తనిఖీ చేయాలని ఆదేశించారు. తనిఖీల సమయంలో కీలకమైన సమస్యలను గుర్తించిన అనంతరం వాటి పరిష్కారానికి తీసుకున్న చర్యలపై నివేదిక ఇవ్వాలని తెలిపారు. బీసీ, గిరిజన, మైనార్టీ సంక్షేమ శాఖల అధికారులు జి.జ్యోతి, ఫిరంగి, ముహమ్మద్ ముజాహిద్, డీఐఈఓ రవిబాబు తదితరులు పాల్గొన్నారు.


