తిరుమలాయపాలెం: మండలంలోని రాజారంలో చేపడుతున్న భూముల రీసర్వేకు రైతులు సహకరించాలని అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి సూచించారు. రాజారంలో రీసర్వే శుక్రవారం మొదలుకాగా, ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ రైతులతో మాట్లాడుతూ భూముల హద్దులు స్పష్టంగా తెలియజేయడమే కాక పత్రాలను అధికారులకు సమర్పిస్తూ సర్వే సజావుగా సాగేలా సహకరించాలని కోరారు. ప్రస్తుతం ఉన్న సర్వే నంబర్లు అలాగే కొనసాగుతాయని, అదనంగా ప్రతీభూ భాగానికి ల్యాండ్ పార్సిల్ మ్యాప్(ఎల్‌పీఎం) నంబర్లు కేటాయిస్తామని తెలిపారు. కాగా, గ్రామంలో 1,100 ఎకరాల భూమి ఉండగా వంద ఎకరాలు ప్రభుత్వ భూమి మినహా మిగతా భూమి సర్వే చేస్తామని వెల్లడించారు. భవిష్యత్‌లో ఇబ్బందులు రాకుండా చేపడుతున్న సర్వేకు రైతులు సహకరించాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ సర్వే(డీఐ) యర్రాప్రగడ, తహసీల్దార్ లూథర్ విల్సన్, డీటీ సుధీర్, సర్వేయర్ సతీశ్‌రెడ్డి, ఆర్‌ఐ లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.


