ఆర్టీసీకి గి‘రాఖీ’.. | - | Sakshi
Sakshi News home page

ఆర్టీసీకి గి‘రాఖీ’..

Sep 3 2026 4:09 AM | Updated on Sep 3 2026 4:09 AM

● 3,834 బస్సులు.. 17.15 లక్షల కిలోమీటర్ల ప్రయాణం ● 472 ప్రత్యేక సర్వీసులతో రూ.1.81 కోట్ల రాబడి ● రక్షాబంధన్‌ రోజు 109 శాతం ఓఆర్‌, రూ.2.31 కోట్ల ఆదాయం

ఆరు రోజుల్లో రూ.11.07 కోట్ల ఆదాయం
● 3,834 బస్సులు.. 17.15 లక్షల కిలోమీటర్ల ప్రయాణం ● 472 ప్రత్యేక సర్వీసులతో రూ.1.81 కోట్ల రాబడి ● రక్షాబంధన్‌ రోజు 109 శాతం ఓఆర్‌, రూ.2.31 కోట్ల ఆదాయం

ఖమ్మంమయూరిసెంటర్‌: రాఖీ పండుగ.. వరుస సెలవులు టీజీఎస్‌ఆర్టీసీకి కాసుల వర్షం కురిపించాయి. సోదరులకు రాఖీలు కట్టేందుకు పల్లెలకు బయలుదేరిన మహిళలు పెద్ద సంఖ్యలో ఆర్టీసీ బస్సులను ఆశ్రయించారు. దీంతో గత నెల 26 నుంచి 31వ తేదీ వరకు బస్సుల్లో ప్రయాణికుల రద్దీ భారీగా పెరిగింది. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆర్టీసీ అధికారులు ముందస్తు ఏర్పాట్లు చేసి సాధారణ సర్వీసులతో పాటు ప్రత్యేక బస్సులను నడిపారు.

ఆరు రోజుల్లో భారీ ఆదాయం..

ఖమ్మం రీజియన్‌లో ఏడు డిపోల పరిధిలో ఆరు రోజుల పాటు మొత్తం 3,834 బస్సు సర్వీసులను అధికారులు నడిపించారు. ఈ బస్సులు 17,15,503 కిలోమీటర్లు ప్రయాణించి మొత్తం రూ.11,07,96,505 ఆదాయం సమకూర్చాయి. ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని అదనంగా 472 ప్రత్యేక సర్వీసులు నడపగా.. వీటి ద్వారా రూ.1,81,74,894 ఆదాయం వచ్చింది.

రాఖీ రోజున 109 శాతం ఓఆర్‌..

రక్షాబంధన్‌ పండుగ రోజైన గత నెల 28న ప్రయాణికుల రద్దీ మరింత పెరిగింది. ఈ సందర్భంగా ఖమ్మం రీజియన్‌లో 697 సర్వీసులను నడిపారు. బస్సులు 109 శాతం ఆక్యుపెన్సీ రేషియో (ఓఆర్‌) సాధించగా.. ఒక్కరోజులోనే రూ.2,31,19,114 ఆదాయం సమకూరింది.

ఆదివారం అదే జోరు..

రాఖీ పండుగ అనంతరం వచ్చిన ఆదివారం కూడా ఆర్టీసీ బస్సులకు ప్రయాణికుల నుంచి మంచి ఆదరణ లభించింది. హైదరాబాద్‌తో పాటు ఇతర నగరాలు, ప్రాంతాల నుంచి ఉమ్మడి జిల్లాకు వచ్చిన వారు తిరుగు పయణమయ్యారు. గత నెల 31న 712 సర్వీసులను అధికారులు నడిపారు. ఈ సర్వీసుల్లో 100 శాతం ఓఆర్‌ నమోదై.. ఆ రోజున సంస్థకు రూ.2,24,68,253 ఆదాయం వచ్చింది.

ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా..

రాఖీ పండుగతో పాటు వారాంతపు సెలవులు రావడంతో ప్రయాణికుల రద్దీ ఉంటుందని ముందుగానే అంచనా వేశారు. రీజినల్‌ మేనేజర్‌ ఎ.సరి రామ్‌ నేతృత్వాన అధికారులు సాధారణ సర్వీసులకు అదనంగా ప్రత్యేక బస్సులను అందుబాటులో ఉంచడంతో ప్రయాణికులు వారి గమ్యస్థానాలకు సౌకర్యవంతంగా చేరుకున్నారు. ప్రయాణికుల రద్దీని సమర్థవంతంగా నిర్వహించడంతో పాటు సంస్థకు గణనీయమైన ఆదాయం సమకూరింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement