జిల్లాలో సరిపడా నిల్వలు ఉన్నా యాప్‌తో గందరగోళం
పత్తి, వరి పంటలకు పెరిగిన వాడకం
ఎఫ్‌బీఏ యాప్‌తో తీసుకున్న రైతులు మళ్లీ అదనంగా స్టాక్
జిల్లాకు అదనంగా యూరియా..
సిగ్నల్ సరిగా రావట్లే..
రాష్ట్రానిది పోయి.. కేంద్రానిది వచ్చి..
గత వానాకాలం వరి, పత్తి, ఇతర పంటలకు కీలకమైన సమయంలో యూరియా అందక నిరసనలు వెల్లువెత్తాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం యూరియాను ప్రణాళికా ప్రకారం పంపిణీ చేసేలా గత యాసంగిలో ఎఫ్‌బీఏ(ఫెర్టిలైజర్ బుకింగ్ యాప్)ను తీసుకొచ్చింది. ఈ వానాకాలంలోనూ రాష్ట్ర ప్రభుత్వం దీన్ని కొనసాగించింది. దీంతో జిల్లాలో ముందస్తుగా పంటలు సాగు చేసిన రైతులు చాలా మంది యాప్ ద్వారా యూరియా పొందారు. ఆతర్వాత రాష్ట్ర ప్రభుత్వ యాప్‌ను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసి గతనెల 6న దేశ వ్యాప్తంగా ఎఫ్‌ఎఫ్‌ఎస్ (ప్రేమ్ వర్క్ ఫర్ ఫర్టిలైజర్ సేల్) యాప్‌ని ప్రవేశపెట్టింది. ఈ యాప్ ద్వారానే ప్రస్తుతం యూరియా బుకింగ్ చేస్తున్నారు.
సిగ్నల్ రాక.. స్టాక్ అయిపోయి..
చాలాచోట్ల సిగ్నల్ రాక ఎఫ్‌ఎఫ్‌ఎస్ యాప్‌లో ఎరువులు సకాలంలో బుక్ చేసుకోలేకపోతున్నామని రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. సిగ్నల్ వచ్చిన చోటకు వెళ్లి బుక్ చేసుకుని కేంద్రాల వద్దకు వెళ్తున్నా స్టాక్ అయిపోతోంది. వేంసూరు మండలం భరణిపాడు పీఏసీఎస్‌లో మంగళవారం ఇలాగే జరగగా రైతులు నిరసన తెలిపారు. స్టాక్ ఉన్న కేంద్రాల్లో యూరియా వెంటనే ఇస్తున్నట్లు సంబంధిత అధికారులు చెబుతున్నా క్షేత్ర స్థాయిలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉండడంతో యాప్‌నే రద్దు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
ముందస్తుగా స్టోర్..
జిల్లాలో బోర్లు, బావులు, వర్షాధారంగా 4.34 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. గత అనుభవాలతో ప్రభుత్వం జిల్లాల్లో యూరియా నిల్వ చేసింది. ప్రధానంగా పత్తి, వరి పంటలకు యూరియా ఎక్కువ అవసరం. ఎకరానికి ప్రభుత్వం రెండు బస్తాల యూరియా ఇస్తుంది. ముందుగా రాష్ట్ర ప్రభుత్వ యాప్ ఎఫ్‌బీఏలో కొందరు రైతులు యూరియా బుక్ చేసుకొని గత నెల 5 వరకు తీసుకున్నారు. ఆతర్వాత కేంద్ర ప్రభుత్వం యాప్ ద్వారా మళ్లీ తీసుకుంటున్నారు. గతంలో రెండు బస్తాలు తీసుకున్న వారికి కేంద్ర యాప్‌తో మరోసారి రెండు బస్తాల యూరియా తీసుకునే వీలు కలిగింది. ఇలాంటి రైతులు వచ్చే యాసంగికి నిల్వ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ పరిస్థితితో తొలిసారి యూరియా తీసుకునే వారికి మాత్రం దొరకడం లేదు.
సరిపడా నిల్వలు ఉన్నా..
జిల్లాలకు ఈ వానాకాలం పంటలకు 35,266.98 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉన్నట్లు ప్రతిపాదించారు. కానీ 38,758.51 మెట్రిక్ టన్నుల యూరియా వచ్చింది. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు 30,814.695 మెట్రిక్ టన్నులు పంపిణీ అయింది. జిల్లాలో ఈ వానాకాలం సాగు చేసిన పంటలకు సరిపడా యూరియా ఉన్నా బుకింగ్‌లో సమస్యలు వేధిస్తున్నాయి.
బుకింగ్‌కాక..
యూరియా దొరక్క
ఈ సీజన్‌లో జిల్లాకు కావాల్సిన దానికన్నా అదనంగా యూరియా సరఫరా అయింది. పంపిణీలో ఎక్కడా ఇబ్బందులు లేవు. వచ్చే యాసంగి పంటలకు కొందరు రైతులు ముందస్తుగా తీసుకుంటున్నారు. ఇలా తీసుకోవద్దని రైతులకు చెబుతున్నాం.
– ధనసరి పుల్లయ్య, జిల్లా వ్యవసాయ అధికారి
ముప్ఫై ఎకరాల్లో వరి వేశా. రాష్ట్ర ప్రభుత్వం యాప్‌లో 15 బస్తాల యూరియా వచ్చింది. కేంద్రం యాప్‌లో బుకింగ్‌కు సిగ్నల్ సమస్య వేధిస్తోంది. సిగ్నల్ వచ్చి బుక్ చేసినా సొసైటీకి వెళ్లేలోగా స్టాక్ అయిపోతోంది. అధికారులు సమస్యను పరిష్కరించాలి. – బొంతు సత్యనారాయణ, భరణిపాడు,
వేంసూరు మండలం


